RBI: జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ఇవే

Starting January 1 2025 a slew of regulatory and financial changes comes into effect

  • ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చిన పలు కొత్త రూల్స్
  • ఈపీఎఫ్‌వో, జీఎస్టీలో కీలక మార్పులు
  • యూపీఐ పేమెంట్స్, హెచ్-1బీ వీసా రూల్స్‌లోనూ అమల్లోకి పలు నిబంధనలు

విధానాల మెరుగుదల, సేవల విస్తరణ, సులభతరం చేయడంలో భాగంగా పలు ప్రభుత్వ విభాగాలు చేపట్టిన ఆర్థిక సంబంధమైన కొన్ని మార్పులు ఇవాళ్టి (జనవరి 1, 2025) నుంచి అమల్లోకి వచ్చాయి. సామాన్యుల నుంచి పన్ను చెల్లింపుదార్ల వరకు ప్రభావితం కానున్న ఆ రూల్స్‌పై అవగాహన పొందడం ప్రయోజనకరం. మరి, ఆ వివరాలు మీరూ తెలుసుకోండి.

ఈపీఎఫ్‌వో కొత్త రూల్
కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థలో (సీపీపీఎస్) భాగంగా పెన్షన్ ఉపసంహరణను ఈపీఎఫ్‌వో క్రమబద్ధీకరించిది. దీంతో, పెన్షన్ ఉపసంహరణ మరింత సులభంగా మారింది. పెన్షనర్లు ఇకపై దేశంలోని ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్‌ను ఉపసంహరించుకోవచ్చు. అదనపు ధ్రువీకరణ ఇబ్బందులు కూడా తొలగిపోనున్నాయి. మరోవైపు, ఈపీఎఫ్‌వో త్వరలోనే ఏటీఎం కార్డులను జారీ చేయనుంది. ఈ విధానం అందుబాటులోకి వస్తే ఈపీఎఫ్‌వో చందాదారులు 24 గంటలపాటు డబ్బును విత్‌డ్రా చేసుకునే అవకాశం దక్కుతుంది. అంతేకాదు, ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ పరిమితిని కూడా ప్రభుత్వం ఈ ఏడాది తొలగించే అవకాశాలు ఉన్నాయి.

జీఎస్టీ విధానంలో కీలక మార్పులు
జీఎస్టీ పోర్టల్‌లో మెరుగైన భద్రత కోసం పన్ను చెల్లింపుదారులు జనవరి 1 నుంచి మల్టీ-ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను పాటించడం తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. మరోవైపు, 180 రోజుల కంటే పాత బేస్ డాక్యుమెంట్లకు ఈ-వే బిల్లులు (ఈడబ్ల్యూ‌బీలు) జనరేట్ కావు. 

ఫీచర్ ఫోన్లలో యూపీఐ పేమెంట్స్ పరిమితి పెంపు
‘యూపీఐ 123పే’ ద్వారా ఫీచర్ ఫోన్లలో పేమెంట్లు చేస్తున్నవారు ఇవాళ్టి నుంచి రోజుకు గరిష్ఠంగా రూ.10,000 వరకు చెల్లింపులు చేసుకోవచ్చు. ఇందుకు అనుగుణంగా మునుపటి రూ.5,000 పరిమితిని ఆర్బీఐ పెంచింది. ఇటీవలే సర్క్యూలర్‌ను కూడా జారీ చేసింది.

రూ.2 లక్షల వరకు హామీ లేని రైతు రుణం
దేశంలోని రైతులు ఇకపై రూ.2 లక్షల వరకు హామీలేని బ్యాంక్ రుణాన్ని పొందవచ్చు. ఈ మేరకు మునుపటి రూ.1.60 లక్షల పరిమితిని ఆర్బీఐ పెంచింది. ఈ కొత్త నిబంధన రైతులకు మరింత ఉపశమనం కల్పించనుంది. రైతు పెట్టుబడికి ఈ విధానం మరింత దోహదపడనుంది.

హెచ్-1బీ వీసా ప్రక్రియలో మార్పులు
ఇవాళ్టి నుంచి భారతదేశంలోని నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులు తమ వీసా అపాయింట్‌మెంట్‌ను ఉచిత రీషెడ్యూల్‌ చేసుకోవచ్చు. అయితే, రెండవసారి రీషెడ్యూల్ చేయాలనుకుంటే కొత్త దరఖాస్తుతో పాటు వీసా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అపాయింట్‌మెంట్ షెడ్యూలింగ్‌ ప్రక్రియను సజావుగా కొనసాగించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారు. మరోవైపు, జనవరి 17 నుంచి హెచ్-1 వీసా ప్రక్రియ అప్‌డేట్ కానుంది. కొత్త విధానం కంపెనీల యజమానులకు అనుకూలంగా ఉంటుంది. భారతీయ హెచ్-1బీ వీసాదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

  • Loading...

More Telugu News