Virat Kohli: నూతన సంవత్సరం వేళ.. సిడ్నీ వీధుల్లో భార్య అనుష్కతో కలిసి కోహ్లీ చక్కర్లు.. వీడియో వైరల్!
- బీజీటీ సిరీస్ కోసం ప్రస్తుతం ఆస్ట్రేలియాలో భారత జట్టు
- మెల్‌బోర్న్ టెస్టు ముగిసిన తర్వాత సిడ్నీ చేరుకున్న టీమిండియా
- ఈ క్రమంలో కొత్త ఏడాది పార్టీకి భార్యతో కలిసి వెళ్లిన కోహ్లీ
- న్యూ ఇయర్ పార్టీ కోసం బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కనిపించిన స్టార్ కపుల్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్ కోసం ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియాలో ఉన్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచుల ఈ సిరీస్ లో ఇప్పటికే నాలుగు టెస్టులు ముగిశాయి. ఆఖరిదైన ఐదో టెస్టు సిడ్నీ వేదికగా జరగనుంది. దీనికోసం టీమిండియా మెల్‌బోర్న్ నుంచి సిడ్నీ చేరుకుంది. ఈ క్రమంలో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి సిడ్నీ వీధుల్లో చక్కర్లు కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్టార్ కపుల్ న్యూ ఇయర్ పార్టీ కోసం బ్లాక్ అవుట్‌ఫిట్‌లో వెళ్తుండడం వీడియోలో ఉంది. వారితో పాటు యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్ కూడా వీడియోలో కనిపించారు. ఈ వీడియోను విరాట్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో తెగ షేర్ చేస్తుండడంతో వైరల్‌గా మారింది.
ఇదిలాఉంటే.. బీజీటీ సిరీస్‌లో రోహిత్ సేన అనుకున్న స్థాయిలో రాణించకపోవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులోనూ భారత్ ఘోర ఓటమి చవిచూసింది. దాంతో టీమిండియాపై విమర్శలు మరింత పెరిగాయి. ఇప్పటికే 2-1తో సిరీస్‌లో భారత జట్టు వెనుకబడింది.
ఈ క్రమంలోనే సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మపై మాజీలు పెదవి విరుస్తున్నారు. జట్టుకు అండగా ఉండాల్సిన వీరిద్దరూ భారంగా మారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఒక అడుగు ముందుకేసి కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పడం గమనార్హం.
కాగా, తన టెస్టు కెరీర్‌లో 122 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 30 సెంచరీలతో 9,207 పరుగులు చేశాడు. తన కెప్టెన్సీలో కోహ్లీ ఆస్ట్రేలియాలో విదేశీ సిరీస్ విజయాలు సహా భారత్‌ను చారిత్రాత్మక విజయాల వైపు నడిపించాడు. దాంతో అతను టీమిండియా అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్‌లలో ఒకడిగా నిలిచాడు. మరోవైపు రోహిత్ శర్మ తన కెరీర్‌లో 67 టెస్టులు ఆడి 4,302 పరుగులు చేశాడు. అతని టెస్ట్ కెరీర్‌లో కొన్ని చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఉన్నాయి.
అయితే, హిట్‌మ్యాన్ టెస్టుల కంటే వైట్ బాల్ క్రికెట్‌లోనే ఆటగాడిగా, కెప్టెన్‌గా బాగా సక్సెస్ అయ్యాడు. ఒంటిచేత్తో జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు. 2023లో వన్డే వరల్డ్‌కప్ లో ఫైనల్ వరకు తీసుకెళ్లిన రోహిత్... గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ టైటిల్ అందించాడు. కానీ, ప్రస్తుతం ఫామ్‌లేమితో ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు సతమతమవుతున్నారు.