Ongole: అప్పు తీర్చమన్నందుకు 'సినీ' ఫక్కీలో బెదిరింపులు

fake police arrested in ongole

  • నకిలీ పోలీస్‌లతో అప్పు ఇచ్చిన వ్యక్తికి బెదిరింపులు
  • ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో ఘటన
  • నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు

ఇచ్చిన అప్పు తీర్చమని అడిగినందుకు ఓ ప్రబుద్ధుడు సినీ ఫక్కీలో బెదిరింపులకు పాల్పడి అడ్డంగా కేసులో ఇరుక్కున్నాడు. అతనికి సాయంగా నకిలీ పోలీసుల అవతారం ఎత్తిన వారు కటకటాల పాలయ్యారు. ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపిన వివరాల ప్రకారం.. 
 
ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని భాగ్యనగర్‌లో సెలూన్ షాపు నిర్వహించే శ్యామ్ కుమార్ తన అవసరాల కోసం ఒంగోలుకే చెందిన ఓ వ్యక్తి వద్ద నుంచి పది లక్షలు అప్పు తీసుకున్నాడు. ఆరు నెలలు గడుస్తున్నా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో అప్పు ఇచ్చిన వ్యక్తి ఒత్తిడి పెంచాడు. అయితే అప్పు తీర్చే ఉద్దేశం లేని శ్యామ్ కుమార్.. అతనికి అప్పు ఎగ్గొట్టడంతో పాటు అతని నుంచే పెద్ద మొత్తంలో డబ్బు కాజేయాలని ప్లాన్ చేశాడు. 

హైదరాబాద్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తూ, యూట్యూబ్ వీడియోలు తీసే తనకు పరిచయస్తురాలైన విజయలక్ష్మిని శ్యామ్ కుమార్ సంప్రదించాడు. తనకు సహాయం చేయాలని, అందుకు డబ్బులు కూడా ఇస్తానని చెప్పాడు. దీంతో ఆమె హైదరాబాద్ నుంచి సందాపురం శ్రీశైలం, దోర్నాల శ్రీశైలంను ఒంగోలుకు పంపింది. వీరు హైదరాబాద్ కృష్ణా నగర్‌లో సినిమా షూటింగ్‌లకు అద్దెకు దుస్తులు సప్లై చేసే వారి నుంచి నాలుగు జతల పోలీస్ యూనిఫామ్ తెచ్చుకున్నారు. 

డిసెంబర్ 29న ఉదయం ఒంగోలులోని శ్యామ్ కుమార్ ఇంటి వద్దకు చేరుకున్నారు. ప్లాన్‌లో భాగంగా అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు తన రూమ్ వద్దకు వస్తే డబ్బులు ఇస్తానని శ్యామ్ కుమార్ చెప్పడంతో బాధితుడు రూమ్ వద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడ విజయవాడకు చెందిన ఓ యువతి గదిలో ఉంటోంది. పథకం ప్రకారం పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న నలుగురు ఒక్కసారిగా వచ్చి బాధితుడిపై దాడి చేసి రేప్ కేసు పెడతామని బెదిరించారు. ఎస్ఐ యూనిఫామ్‌లో ఉన్న వ్యక్తి బాధితుడి వద్ద ఉన్న ఉంగరం లాక్కుని, దుస్తులు తీసేశాడు. కోటిన్నర రూపాయలు ఇవ్వాలని లేకపోతే ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని అతన్ని బెదిరించాడు.

దీంతో తీసుకున్న అప్పు డబ్బులు ఎగ్గొట్టేందుకు శ్యామ్ కుమార్ ఇదంతా చేశాడని గుర్తించిన బాధితుడు వెంటనే ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఇదంతా చలగర్ల శ్యామ్ కుమార్ ప్లాన్‌గా గుర్తించారు. అతనితో పాటు ఈ నేరంలో సహకరించిన నిమ్మల విజయలక్ష్మి, సందాపురం శ్రీశైలం, సురేష్, అంబర్‌పేట శ్రీలక్ష్మి, కొక్కిరపాటి దుర్గాప్రసాద్, దోర్నాల వినోద్ కుమార్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ మీడియాకు తెలిపారు. ఈ కేసులో రాజు, దోర్నాల శ్రీశైలం పరారీలో ఉన్నట్లు తెలిపారు.   

  • Loading...

More Telugu News