Chandrababu: క్యాడర్ తో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్... 2029 ఎన్నికలే లక్ష్యం అంటూ దిశానిర్దేశం
- ఏదీ రాత్రికి రాత్రే జరిగిపోదన్న చంద్రబాబు
- కష్టపడి పనిచేస్తేనే ఫలితాలు వస్తాయని వెల్లడి
- వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్ధం కావాలని పిలుపు
2024 ఏడాది ముగుస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తమ పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏదైనా సరే రాత్రికి రాత్రే జరిగిపోవాలని ఆశించవద్దని, కష్టపడి పనిచేస్తేనే ఫలితాలు వస్తాయని స్పష్టం చేశారు. 2029 ఎన్నికలకు మనం ఇప్పటి నుంచే పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
2024 మనకు స్ఫూర్తిదాయక సంవత్సరం అని చంద్రబాబు అభివర్ణించారు. అక్టోబరు 26న ప్రారంభించిన సభ్యత్వాలు 93 లక్షలు దాటాయని, రాబోయే రోజుల్లో దశ దిశ నిర్దేశించుకుందామని తెలిపారు. రూ.100 సభ్యత్వ రుసుముతో రూ.5 లక్షల బీమా అందించబోతున్నామని వివరించారు.
తెలంగాణలో భారీ ఎత్తున సభ్యత్వాలు నమోదవుతున్నాయని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. సభ్యత్వ నమోదును మరో 15 రోజులు పొడిగించామని తెలిపారు. మహానాడు లోపు అన్ని కమిటీల నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు.
ఎక్సైజ్ శాఖపై చంద్రబాబు సమీక్ష
సీఎం చంద్రబాబు నేడు ఎక్సైజ్ శాఖపైనా సమీక్ష జరిపారు. గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం తీసుకున్నారు. 340 దుకాణాలు కేటాయించేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసేందుకు పచ్చజెండా ఊపారు.
ఇక, రిటైల్ షాపుల మార్జిన్ ను 10.5 శాతం నుంచి 14 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రూ.99కే మద్యంతో పాటు, అన్ని రకాల బ్రాండ్లు దుకాణాల్లో అందుబాటులో ఉంచాలని చంద్రబాబు స్పష్టం చేశారు. బెల్ట్ షాపులపై కఠిన వైఖరి అవలంబించాలని, టెక్నాలజీ ద్వారా మద్యం అమ్మకాలు ట్రాక్ చేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు నిర్దేశించారు.