Unstoppable With NBK: 'అన్‌స్టాపబుల్' సెట్‌లో రామ్ చరణ్, బాలయ్య... ఫన్నీ వీడియో చూశారా?
- బాలయ్య అన్‌స్టాపబుల్ షోకు రామ్ చరణ్
- ఈ టాక్ షో షూటింగ్ స్పాట్‌లో గ్లోబల్ స్టార్ హల్‌చల్
- బాలకృష్ణతో కలిసి సరదా సంభాషణ
- నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్‌స్టాపబుల్‌కు మంచి ప్రజాదరణ ఉన్న విషయం తెలిసిందే. ఈ షోకు వచ్చే గెస్టులను తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తూ బాలయ్య అదరగొడుతుంటారు. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ టాక్ షో... ప్రస్తుతం నాలుగో సీజన్ లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇప్పటికే ఏడు ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాయి. నాలుగో సీజన్ మొదటి ఎపిసోడ్‌కు సీఎం చంద్రబాబు విచ్చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఈ షోలో తమ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ నటులు విచ్చేసి సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్లు ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి, నిర్మాత సురేశ్ బాబు పాల్గొని సందడి చేశారు.
ఇక ఈ టాక్ షోలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా సందడి చేయబోతున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ తాలూకు షూటింగ్ జరిగింది. ఈ సందర్భంగా సెట్‌లో బాలయ్య, రామ్ చరణ్ మధ్య జరిగిన సరదా సంభాషణకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో గ్లోబల్ స్టార్‌ను బాలకృష్ణ సరదాగా ఆటపట్టించడం కనిపించింది. మొదట సెట్‌లో చెర్రీని చూసిన బాలయ్య తనను బ్రో అని పిలవాలని అంటారు. కానీ, చరణ్ సార్ అని పిలుస్తారు. అప్పుడు బాలయ్య నువ్వు నన్ను బ్రో అని పిలిస్తేనే సెట్‌లోకి రానిస్తాను లేదంటే నా సెట్‌లోకి నీకు అనుమతి ఉండదు. అలా అంటూనే చరణ్‌ను బాలయ్య ఆలింగనం చేసుకుంటారు.
అలా కొద్దిసేపు వారిద్దరూ ఫన్నీగా మాట్లాడుకోవడం వీడియోలో ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది చూసిన ఇరువురు హీరోల అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇక నందమూరి, మెగా అభిమానులు ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ ఎపిసోడ్ త్వరలోనే ఆహాలో ప్రసారం కానుందని సమాచారం.