Andhra Pradesh: ఏపీలో శరవేగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
- రాష్ట్రంలోని 63,77,943 మంది పింఛన్దారుల కోసం రూ. 2,717 కోట్లు విడుదల
- కొత్త సంవత్సరం నేపథ్యంలో ఈరోజే పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వం
- ఉదయం 10 గంటల సమయానికి 53,22,406 మందికి రూ. 2,256 కోట్లు పంపిణీ
- జియో ట్యాగింగ్ ద్వారా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న అధికారులు
- పల్నాడు జిల్లా యల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం
ఏపీలో ఈరోజు ఉదయం నుంచి శరవేగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది. రాష్ట్రంలోని 63,77,943 మందికి పింఛన్ల పంపిణీ కోసం కూటమి ప్రభుత్వం రూ. 2,717 కోట్లు విడుదల చేసింది. కొత్త సంవత్సరం నేపథ్యంలో ప్రభుత్వం 31వ తేదీనే పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టింది.
జనవరి 1వ తేదీకి ముందే పేదల ఇళ్లల్లో పింఛను డబ్బు ఉండాలని ఒక రోజు ముందుగానే పంపిణీ కార్యక్రమం చేపట్టింది సర్కార్. దీనిలో భాగంగా ఇవాళ ఉదయం నుంచి ఇప్పటి వరకు 83.45 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఉదయం 10 గంటల సమయానికి 53,22,406 మందికి రూ. 2,256 కోట్లు పంపిణీ చేశారు.
లబ్దిదారుల ఇళ్లను జియో ట్యాగింగ్ చేసి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు పరిశీస్తున్నారు. ఇళ్ల వద్దే పింఛన్లు ఇస్తున్నారా? లేదా? అనే విషయాన్ని జియో ట్యాగింగ్ ద్వారా అధికారులు తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ఇంటి వద్దనే పింఛన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో జియో ట్యాగింగ్ విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు మరికొద్దిసేపట్లో పల్నాడు జిల్లా యల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.