Free Bus Journey For Women: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉగాది నుంచేనా...?

AP Govt speeds up free bus journey for women scheme

  • మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
  • ఎన్నికల వేళ హామీ ఇచ్చిన కూటమి పార్టీలు
  • ఆ దిశగా దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం
  • ఇటీవల మంత్రుల ఉపసంఘం ఏర్పాటు
  • నేడు అధికారులతో సమీక్ష జరిపిన చంద్రబాబు

తాము గెలిస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎన్నికల వేళ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కూటమి ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించింది. ఉచిత ప్రయాణంపై అధ్యయనం చేసేందుకు మంత్రుల ఉపసంఘాన్ని కూడా నియమించారు. 

వచ్చే నెలలో సంక్రాంతి నుంచే ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తారంటూ వార్తలు వచ్చినా, దానిపై ఇంకా నివేదిక రాలేదు. ఈ నేపథ్యంలో, ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధికారులతో సీఎం చంద్రబాబు నేడు కీలక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ, డీజీపీ, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉచిత బస్సు ప్రయాణ పథకంపై తీసుకుంటున్న చర్యల పట్ల సీఎం చంద్రబాబు మంత్రి రాంప్రసాద్ రెడ్డిని, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 

ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితులను అధ్యయనం చేస్తామని అధికారులు ముఖ్యమంత్రితో చెప్పారు. కర్ణాటక, తెలంగాణ, ఢిల్లీలో అధ్యయనం చేసి నివేదిక ఇస్తామని తెలిపారు. 

దీనిపై సాధ్యమైనంత త్వరగా సమగ్ర నివేదిక అందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. ఉగాది నాటికి పథకం అమలు జరిగేలా కార్యాచరణలో వేగం పెంచాలని నిర్దేశించారు.

  • Loading...

More Telugu News