Chandrababu: 'తెలుగుతల్లికి జలహారతి'... భారీ ప్రాజెక్టు పేరు ప్రకటించిన సీఎం చంద్రబాబు

 CM Chandrababu announces huge project name Telugu Talliki Jala Harathi

  • ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తున తీసుకువస్తున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు
  • ఏపీకి  గేమ్ చేంజర్ అవుతుందన్న చంద్రబాబు
  • నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తామని వెల్లడి

ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తున తీసుకువస్తున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్టు పేరును ప్రకటించారు. 'తెలుగుతల్లికి జలహారతి' అని ప్రాజెక్టు పేరు వెల్లడించారు. 

ప్రాజెక్టు గురించి చెబుతూ, రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగితే రతనాల సీమ అవుతుందని అన్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తరచుగా కరవు బారినపడుతున్నాయని వివరించారు. పరీవాహక ప్రాంతాల్లోని రాష్ట్రాల నీటి వినియోగం కారణంగా... కృష్ణా నదిలో తగినంత నీటి లభ్యత ఉండడం లేదని వివరించారు. ఒక్క గోదావరి నదిలో మాత్రమే ఆశించిన మేర జలాలు అందుబాటులో ఉంటున్నాయని చంద్రబాబు తెలిపారు. 

గోదావరి నీటిని మళ్లించలగితే రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరు అందించవచ్చని పేర్కొన్నారు. నదులు అనుసంధానం చేయగలిగితే రాష్ట్ర వ్యవసాయ రంగానికి నీటి కొరత అనే మాట వినిపించదని స్పష్టం చేశారు. గోదావరి నుంచి కనీసం 300 టీఎంసీల నీటిని కృష్ణా నదికి తీసుకురావడం... కృష్ణా పశ్చిమ, తూర్పు డెల్టాలకు నీళ్లు ఇచ్చిన తర్వాత ఇక్కడ్నించి బనకచర్లకు నీటిని తీసుకువెళ్లడం ఈ ప్రాజెక్టులో ప్రధానమైన అంశం. ఇది మూడు దశల్లో ఉంటుంది. దీనిద్వారా వెలుగొండ ఆయకట్టు కూడా కవర్ అవుతుంది. 

నాగార్జునసాగర్ కుడి కాలువపై బొల్లాపల్లి ప్రాజెక్టు వస్తుంది... ఆ తర్వాత వెలుగొండ ప్రాజెక్టు... అక్కడ్నించి బనకచర్ల ప్రాజెక్టుకు నీళ్లు వెళతాయి. నల్లమల అడవులను కొంతమేర నరికి టన్నెల్ ఏర్పాటు చేసిన బనకచర్లకు నీళ్లు తీసుకువెళతాం. ఇదంతా జరిగితే నదుల అనుసంధానం పూర్తవుతుంది. ఈ  నదుల అనుసంధానం ప్రక్రియలో ఇవే కాకుండా మరికొన్ని ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. 

ఈ ప్రాజెక్టు పూర్తయితే శ్రీకాకుళ, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లా కొన్ని భాగాలు, నెల్లూరు, కడప, అనంతపురం... ఇలా రాష్ట్రమంతా అనుసంధానమై అదనపు ఆయకట్టు కూడా వస్తుంది. 

ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రాజెక్టు ఏపీకి ఒక గేమ్ చేంజర్. అందుకే దీనిపేరు కూడా తెలుగుతల్లికి జలహారతి అని నామకరణం చేశాం. అంటే మనం సమర్పించుకోవడం. కన్నతల్లికి రుణం తీర్చుకోవడం అనే అర్థంలో ఈ పేరు పెట్టాం. ప్రధాని మోదీకి ఈ ప్రాజెక్టు నివేదికను పంపిస్తున్నాం" అని చంద్రబాబు వివరించారు.

  • Loading...

More Telugu News