Hundi: "మా అత్తను త్వరగా చంపు తల్లీ" అంటూ రూ.20 నోటుపై రాసి హుండీలో వేశారు!
కొత్తగా మొక్కుకునే వారు, మొక్కు చెల్లించుకునే వారు ఆలయాల్లోని హుండీల్లో కానుకలు వేయడం తెలిసిందే. కొందరు నగదు రూపంలో, కొందరు వస్తు రూపంలో హుండీలో కానుకలు వేస్తుంటారు. అయితే, కర్ణాటకలోని కలబుర్గి పట్టణంలో ఉన్న భాగ్యమతి అమ్మవారి ఆలయంలోని హుండీలో ఓ కరెన్సీ నోటుపై రాసి ఉన్న అక్షరాలు అందరినీ విస్మయానికి గురిచేశాయి.
అమ్మా... మా అత్తను త్వరగా చంపు తల్లీ అంటూ ఓ రూ.20 నోటుపై రాసి హుండీలో వేశారు. ఆ అక్షరాలు కన్నడ భాషలో ఉన్నాయి. పరకామణిలో హుండీ సొమ్మును లెక్కిస్తుండగా ఈ నోటు కంటబడింది. అయితే, అత్తను చంపమని రాసింది కోడలో, మరి అల్లుడో తెలియదు కానీ... ఆ నోటు మాత్రం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.