Bandi Sanjay: రేవంత్ రెడ్డిని పవన్ కల్యాణ్ ప్రశంసించడంపై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు
- రేవంత్ రెడ్డిని పవన్ కల్యాణ్ ప్రశంసించడాన్ని తప్పుబట్టిన సంజయ్
- ఎందులో గొప్పనో నాకైతే తెలియదని ఎద్దేవా
- హామీలు అమలు చేయనందుకు గొప్పగా కనిపించాడేమోనని పవన్‌కు చురక
సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసించడాన్ని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ తప్పుబట్టారు. పవన్ కల్యాణ్‌కు రేవంత్ రెడ్డిలో ఏం మంచి కనిపించిందోనని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీని అమలు చేయనందుకు ఆయనకు నచ్చారేమోనని విమర్శలు గుప్పించారు.
రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడని పవన్ కల్యాణ్ అన్నారని, దీనిపై మీరేం చెబుతారని ఓ మీడియా ప్రతినిధి... బండి సంజయ్‌ని ప్రశ్నించారు. మీడియా ప్రతినిధి ప్రశ్నపై బండి సంజయ్ స్పందించారు.
రేవంత్ రెడ్డి ఎందుకు గొప్ప నాయకుడిగా కనిపించాడో పవన్ కల్యాణ్‌కు తెలియాలన్నారు. ఎందులో గొప్పనో, ఏ యాంగిల్ లో గొప్పనో తనకైతే తెలియదన్నారు. రైతు భరోసా, తులం బంగారం, 2 లక్షల ఉద్యోగాలు, రూ.4 వేల నిరుద్యోగ భృతి, రూ.4 వేల ఆసరా పెన్షన్ ఇస్తున్నామని చెవిలో చెబితే గొప్పవాడిగా కనిపించాడేమోనని ఎద్దేవా చేశారు.