Yashaswi Jaiswal: అదే పనిగా స్లెడ్జింగ్ చేస్తున్న కొన్ స్టాస్ కు జైస్వాల్ నుంచి అదిరిపోయే 'దెబ్బ'
- యమా రంజుగా సాగిన మెల్బోర్న్ టెస్టు
- అనేక ఆసక్తికర పరిణామాలకు వేదికగా నాలుగో టెస్టు
- జైస్వాల్, కొన్ స్టాస్ మధ్య మాటల యుద్ధం
- జైస్వాల్ కొట్టిన షాట్ కొన్ స్టాస్ డొక్కలో బలంగా తాకిన వైనం
టెస్టు క్రికెట్ లోని మజాకు సిసలైన అర్థం చెప్పేలా మెల్బోర్న్ టెస్టు సాగింది. టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఈ పోరులో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆసీస్ జట్టులో స్లెడ్జింగ్ సంస్కృతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మ్యాచ్ తోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన 19 ఏళ్ల యువ ఓపెనర్ సామ్ కొన్ స్టాస్ కూడా నోటికి పని చెప్పాడు.
టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో, అతడి ఏకాగ్రతను దెబ్బతీసేందుకు కొన్ స్టాస్ అదే పనిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. దాంతో సహనం కోల్పోయిన జైస్వాల్ మాటకు మాట బదులిచ్చాడు. నీ పని చూసుకో అని కాస్త గట్టిగానే చెప్పాడు. ఆ సమయంలో స్పిన్నర్ నాథన్ లైయన్ బౌలింగ్ చేస్తున్నాడు.
ఆ తర్వాత బంతిని లైయన్ ఓవర్ పిచ్ వేయగా, జైస్వాల్ ఆఫ్ సైడ్ గట్టిగా కొట్టడంతో సిల్లీ మిడాఫ్ లో ఫీల్డింగ్ చేస్తున్న కొన్ స్టాస్ డొక్కలో బలంగా తాకింది. కామెంట్రీ బాక్స్ లో ఉన్న ఇర్ఫాన్ పఠాన్, ఇతర కామెంటేటర్లు కూడా "భలే కొట్టాడు" అంటూ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.