Arvind Kejriwal: పూజారులకు నెలకు రూ.18 వేల జీతం.. ఎన్నికల హామీ ప్రకటించిన అరవింద్ కేజ్రీవాల్
- గురుద్వారాల గ్రంథిలకు కూడా నెలకు రూ.18,000 వేతనం
- పూజారులు నిస్వార్థంగా సమాజానికి సేవ చేస్తున్నారు
- వారి ఆర్థిక శ్రేయస్సును ఎవరూ పట్టించుకోవడం లేదు
- రేపటి నుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియను నేనే ప్రారంభిస్తాను
- మీడియా సమావేశంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన
త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తిరిగి విజయం సాధిస్తే దేవాలయాల పూజారులు, గురుద్వారాల గ్రంథి లకు నెలకు రూ.18 వేల వేత్తనాన్ని చెల్లిస్తామని ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈమేరకు సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన మరో ఎన్నికల హామీని ఆయన వెల్లడించారు.
‘‘పురోహితులు, గ్రంథిలు మన మతపరమైన ఆచారాలకు సంరక్షకులుగా కొనసాగుతున్నారు. సమాజానికి నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. దురదృష్టవశాత్తు వారి ఆర్థిక శ్రేయస్సును ఎవరూ పట్టించుకోలేదు. అందుకే మేము మళ్లీ అధికారంలోకి వస్తే నెలనెలా రూ.18,000 జీతం చెల్లిస్తాం. ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ రేపటి (మంగళవారం) నుంచి ప్రారంభమవుతుంది. హనుమాన్ ఆలయంలో నేనే స్వయంగా ఈ ప్రక్రియను ప్రారంభిస్తాను’’ అని కేజ్రీవాల్ తెలిపారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని బీజేపీని తాను అభ్యర్థిస్తున్నానని, ఈ ప్రక్రియను అడ్డగిస్తే పాపం చేసినట్లే అవుతుందని కేజ్రీవాల్ హెచ్చరించారు. పూజారులు, గ్రంథిలు మన దేవుళ్లకు వారధిగా ఉంటున్నారని కొనియాడారు. కాగా, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆప్ పార్టీ వరుసగా ఎన్నికల హామీలను ప్రకటిస్తోంది. ముందుగా సీనియర్ సిటిజన్ల కోసం ‘సంజీవని’ పథకం, ఆ తర్వాత ‘మహిళా సమ్మాన్ యోజన’, తాజాగా అర్చకులకు నెలవారీ వేతన పథకాన్ని మాజీ ముఖ్యమంత్రి ప్రకటించారు.
సంజీవని యోజన కింద 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత ఆరోగ్య సంరక్షణ ఉంటుంది. మహిళా సమ్మాన్ యోజన పథకం కింద మహిళలకు నెలకు రూ.2,100 ఆర్థిక సాయం అందజేస్తామని ఆప్ పార్టీ ప్రకటించింది.