Australia vs India: చేతులెత్తేసిన భార‌త బ్యాట‌ర్లు.. బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్ ఘ‌న విజ‌యం!

Australia Won by 184 Runs in Melbourne Test

  • మెల్‌బోర్న్ వేదిక‌గా భార‌త్‌, ఆసీస్ నాలుగో టెస్టు
  • 184 ర‌న్స్ తేడాతో ఆస్ట్రేలియా ఘ‌న విజ‌యం 
  • హాఫ్ సెంచ‌రీ (84) తో ఒంట‌రి పోరాటం చేసిన య‌శ‌స్వి జైస్వాల్ 
  • ఐదు మ్యాచుల బీజీటీ సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి ఆసీస్

బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్ వేదిక‌గా జ‌రిగిన బాక్సింగ్ డే టెస్టులో టీమిండియాపై ఆతిథ్య ఆస్ట్రేలియా జ‌ట్టు ఘ‌న విజ‌యం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 340 ప‌రుగుల ల‌క్ష్య‌ఛేద‌న‌లో భార‌త్ 155 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో ఆస్ట్రేలియా జ‌ట్టు 184 ర‌న్స్ తేడాతో గెలిచింది. ఈ విజ‌యంతో ఐదు మ్యాచుల బీజీటీ సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 

భార‌త బ్యాట‌ర్ల‌లో యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ హాఫ్ సెంచ‌రీ (84) తో ఒంట‌రి పోరాటం చేశాడు. అత‌నికి మిగ‌తా బ్యాట‌ర్ల నుంచి స‌హ‌కారం క‌రవైంది. మ‌ధ్య రిష‌భ్ పంత్ కొద్దిసేపు క్రీజులో య‌శ‌స్వితో క‌లిసి నిల‌బ‌డ్డాడు. ఈ ఇద్ద‌రూ క‌లిసి ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేశారు. 

33 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయిన ద‌శ‌లో క్రీజులోకి వ‌చ్చిన పంత్ కొద్దిసేపు ఆసీస్ బౌల‌ర్ల‌ను నిలువ‌రించాడు. క్రీజులో కుదురుకున్న‌ట్లు క‌నిపించిన పంత్ 30 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోర్ వ‌ద్ద ట్రావిస్ హెడ్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్ చేరాడు. య‌శ‌స్వి, పంత్‌ ద్వ‌యం 88 ప‌రుగుల భాగ‌స్వామ్యం అందించింది. 

పంత్ ఔటైన త‌ర్వాత టీమిండియా ఏ ద‌శ‌లోనూ ల‌క్ష్యం దిశ‌గా సాగ‌లేదు. వ‌చ్చిన బ్యాట‌ర్లు వ‌చ్చిన‌ట్టుగా పెవిలియ‌న్ బాట‌ప‌ట్టారు. య‌శ‌స్వి కూడా 84 ర‌న్స్ వ‌ద్ద అవుట్ కావ‌డంతో భార‌త ప‌రాజయం ఖాయ‌మైంది. చివ‌రికి రోహిత్ సేన 79.1 ఓవ‌ర్ల‌లో 155 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. 

ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్, బొలాండ్ చెరో 3 వికెట్లు తీయ‌గా... నాథ‌న్ లైయ‌న్ 2, మిచెల్ స్టార్క్‌, ట్రావిస్ హెడ్ త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు. ఆల్‌రౌండ‌ర్ షో (రెండు ఇన్నింగ్స్ ల‌లో క‌లిపి 6 వికెట్లు, 90 ర‌న్స్‌)తో అద‌ర‌గొట్టిన క‌మ్మిన్స్ కు 'ప్లేయ‌ర్‌ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు ద‌క్కింది.  

ఆస్ట్రేలియా మొద‌టి ఇన్నింగ్స్‌: 474, రెండో ఇన్నింగ్స్‌: 234 
భార‌త్ మొద‌టి ఇన్నింగ్స్‌: 369, రెండో ఇన్నింగ్స్‌: 155 

  • Loading...

More Telugu News