H1B Visa: హెచ్-1బీ వీసాపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన ఎలాన్ మస్క్
- హెచ్-1బీ వీసా విధానం విచ్ఛిన్నమైందన్న టెస్లా అధినేత
- భారీ సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం
- కనిష్ఠ వేతనాలను గణనీయంగా పెంచాలంటూ వ్యాఖ్య
అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో కీలక భాగస్వామి కాబోతున్న బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హెచ్-1బీ వీసాపై మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నైపుణ్యమున్న విదేశీ ఉద్యోగులను అమెరికాకు తీసుకురావడానికి ఉపయోగిస్తున్న హెచ్-1బీ వీసా విధానం విచ్ఛిన్నమైందని, భారీ సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘కనిష్ఠ వేతనాన్ని గణనీయంగా పెంచడం, హెచ్-1బీ వీసా నిర్వహణ వార్షిక వ్యయాన్ని జోడించడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. ఇలా చేస్తే దేశీయులను కాదని విదేశీయులను రిక్రూట్ చేసుకోవడం మరింత ఖరీదైనదిగా మారిపోతుంది’’ అని ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు.
ప్రపంచంలో అత్యుత్తమ ప్రతిభావంతులకు అమెరికా ఒక గమ్యస్థానంగా ఉండాలని, అయితే హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ అందుకు ఒక మార్గం కాకూడదంటూ ‘ఎక్స్’ వేదికగా ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. ఈ ట్వీట్‌పై ఎలాన్ మస్క్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, హెచ్-1బీ వీసాలను రక్షించడానికి యుద్ధానికి వెళతానంటూ ఎలాన్ మస్క్ ఈ మధ్యే వ్యాఖ్యానించారు. ఈ విషయమై డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులతో కూడా ఇటీవల ఆయన గొడవకు దిగారు.
ట్రంప్ ప్రభుత్వంలో భాగస్వాములు కాబోతున్న ఎలాన్ మస్క్‌తో పాటు భారతీయ-అమెరికన్ టెక్ వ్యవస్థాపకుడు వివేక్ రామస్వామి కూడా హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌కు మద్దతు తెలుపుతున్నారు. అయితే, భారీ సంస్కరణాలు తీసుకురావాల్సి ఉందని అంటున్నారు. ఎలాన్ మస్క్ హెచ్-1బీ వీసా ద్వారానే దక్షిణాఫ్రికా నుంచి అమెరికాకు వలస వెళ్లారు.