Suchir Balaji: భారత సంతతి మహిళ విజ్ఞప్తిపై మస్క్ ఎలా స్పందించారంటే..!
- ఓపెన్ ఏఐ విజిల్ బ్లోయర్ సుచిర్ బాలాజీ అనుమానాస్పద మరణం
- ఎఫ్ బీఐతో విచారణ జరిపించాలని బాలాజీ తల్లి డిమాండ్
- ట్విట్టర్ లో మస్క్, వివేక్ రామస్వామికి విజ్ఞప్తి
భారత సంతతి యువకుడు, ఛాట్ జీపీటీ మాజీ ఉద్యోగి సుచిర్ బాలాజీ అనుమానాస్పద మరణంపై నిష్పక్షపాతంగా దర్యాఫ్తు జరగాలని ఆయన తల్లి పూర్ణిమ రామారావు డిమాండ్ చేశారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) తో విచారణ జరిపించాలని అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు పూర్ణిమ ట్విట్టర్ ద్వారా ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామికి కూడా విజ్ఞప్తి చేశారు. తన కొడుకు ఆత్మహత్య చేసుకోలేదని, ఎవరో ప్లాన్డ్ గా హత్య చేశారని ట్విట్టర్ లో ఆరోపించారు. సుచిర్ మరణానికి కారణం ఏంటనేది గుర్తించలేకపోయినట్లు డాక్టర్లు పోస్ట్ మార్టం రిపోర్టులో పేర్కొన్నట్లు గుర్తుచేశారు.
శాన్ ఫ్రాన్సిస్కోలోని తన ఫ్లాట్ లో సుచిర్ బాలాజీ అనుమానాస్పద రీతిలో చనిపోయిన విషయం తెలిసిందే. నిజాలు బయటకు రావాలంటే ఎఫ్ బీఐతో విచారణ జరిపించాలని అమెరికా ప్రభుత్వాన్ని పూర్ణిమ డిమాండ్ చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త, ట్రంప్ సన్నిహితుడు ఎలాన్ మస్క్, కీలక నేత వివేక్ రామస్వామికి కూడా పూర్ణిమ ఈ ట్వీట్ ను షేర్ చేశారు. దీనిపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. సుచిర్ బాలాజీ డెడ్ బాడీని, అతడి ఫ్లాట్ లోని వాతావరణం గమనిస్తే సుచిర్ ఆత్మహత్య చేసుకున్నట్లు తనకు అనిపించడంలేదన్నారు. సుచిర్ మరణంపై పూర్ణిమ సందేహాలను మస్క్ బలపరిచారు.
ఇరవై ఆరేళ్ల టెక్ నిపుణుడు సుచిర్ బాలాజీ ఓపెన్ ఏఐ కంపెనీలో కొంతకాలం పనిచేశారు. కంపెనీ తీరు నచ్చక అందులో నుంచి బయటకు వచ్చారు. కాపీరైట్ హక్కులను ఓపెన్ ఏఐ ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ ఉద్యోగానికి రిజైన్ చేశారు. ఓపెన్ ఏఐ విజిల్ బ్లోయర్ గా మారిన సుచిర్ నవంబర్ 26న శాన్ ఫ్రాన్సిస్కోలోని తన ఫ్లాట్ లోనే చనిపోయారు. సుచిర్ బాలాజీ మరణంపై సమగ్ర విచారణ జరగాలని, తమ కొడుకు మరణానికి కారణమైన వారికి శిక్ష పడాలని పూర్ణిమ డిమాండ్ చేస్తున్నారు.