Stock Market: బలహీనంగా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

On the first trading day of the week Indian stock market witnessed a weak opening on Monday

  • స్వల్ప నష్టాల్లో మొదలైన దేశీయ ఈక్విటీ మార్కెట్లు
  • సెన్సెక్స్ 66 పాయింట్లు, నిఫ్టీ 30 పాయింట్ల మేర పతనం
  • ప్రతికూల ప్రభావం చూపుతున్న గ్లోబల్ మార్కెట్ల సంకేతాలు

వారంలో మొదటి ట్రేడింగ్ రోజైన సోమవారం (డిసెంబర్ 30) దేశీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ఆరంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 10.15 గంటల సమయానికి సెన్సెక్స్ 66.32 పాయింట్లు క్షీణించి 78,632.75 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 30.40 పాయింట్లు నష్టపోయి 23,783 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు దేశీయ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలహీనం చేశాయని, మార్కెట్ల పతనానికి ఇదే కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత వారాంతం శుక్రవారం అమెరికా మార్కెట్లు గణనీయమైన నష్టాలను చవిచూశాయని, ఈ పరిణామం భారతీయ మార్కెట్లను ప్రతికూలంగా ప్రభావితం చేస్తోందని పేర్కొన్నారు. మరోవైపు, ఏడాది ముగింపు సమయం కావడంతో విదేశీ సంస్థాగత పెట్టుబడులు తగ్గడం కూడా ఒక కారణమని విశ్లేషిస్తున్నారు.

కాగా, నిఫ్టీపై ట్రెంట్, బజాజ్-ఆటో, విప్రో, మారుతీ, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీల షేర్లు 1 శాతానికి పైగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అపోలో హాస్పిటల్స్, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, సన్‌‌ఫార్మా కంపెనీల షేర్లు లాభాల్లో ట్రెడ్ అవుతున్నాయి. ఇక సెన్సెక్స్-30లో భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్‌లో లాభాల్లో కొనసాగుతున్నాయి. రిలయన్స్, హెచ్‌సీఎల్ టెక్, టాటా మోటార్స్, టీసీఎస్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

  • Loading...

More Telugu News