Rohit Sharma: రోహిత్ శర్మ మరో ఫ్లాప్ షో.. కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ పేరిట అవాంఛిత రికార్డు!
- మెల్‌బోర్న్ టెస్టులో ఘోరంగా విఫలమైన టీమిండియా కెప్టెన్
- కెప్టెన్‌గా మరో కెప్టెన్ చేతిలో అత్యధిక సార్లు ఔటైన రోహిత్
- టెస్టుల్లో ఇప్పటివరకు హిట్‌మ్యాన్‌ను 6సార్లు పెవిలియన్ పంపిన కమ్మిన్స్
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలమవుతున్నాడు. మెల్‌బోర్న్‌లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 3 పరుగులతో నిరాశపరిచిన హిట్‌మ్యాన్.. రెండో ఇన్నింగ్స్ లోనూ అదే ఫ్లాప్ షోను కొనసాగించాడు. కేవలం 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ క్రమంలో కెప్టెన్‌గా రోహిత్ పేరిట ఓ అవాంఛిత రికార్డు నమోదైంది.
టెస్ట్ క్రికెట్‌లో కమ్మిన్స్ బౌలింగ్‌లో రోహిత్ ఔట్ కావడం ఇది ఆరోసారి. దీంతో సుదీర్ఘ ఫార్మాట్‌లో ఒక కెప్టెన్ ప్రత్యర్థి జట్టు కెప్టెన్ చేతిలో ఎక్కువసార్లు ఔటైన అవాంఛిత రికార్డు హిట్‌మ్యాన్ పేరిట నమోదైంది.
టెస్టుల్లో అత్యధిక సార్లు ప్రత్యర్థి కెప్టెన్‌ను ఔట్ చేసిన కెప్టెన్లు వీరే..
6 - ప్యాట్ కమ్మిన్స్ ద్వారా రోహిత్ శర్మ
5 - రిచీ బెనాడ్ ద్వారా టెడ్ డెక్‌స్టార్
5 - ఇమ్రాన్ ఖాన్ ద్వారా సునీల్ గవాస్కర్
4 - రిచీ బెనాడ్ ద్వారా గులాబ్రాయ్ రాంచంద్
4 - కపిల్ దేవ్ ద్వారా క్లైవ్ లాయిడ్
4 - రిచీ బెనాడ్ ద్వారా పీటర్ మే
కాగా, మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో 340 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలోనే తడపడింది. 33 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ (09), విరాట్ కోహ్లీ (05) మరోసారి నిరాశపరచగా.. ఆదుకుంటాడని ఆశించిన కేఎల్ రాహుల్ డకౌట్ అయ్యాడు.
అయితే, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ ద్వయం మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతోంది. జైస్వాల్ మరోసారి హాఫ్ సెంచరీ (63 నాటౌట్)తో జట్టును ఆదుకున్నాడు. మరోవైపు పంత్ కూడా నిలకడగా ఆడుతున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 112/3 (53 ఓవర్లు).. క్రీజులో జైస్వాల్ (63), పంత్ (28) ఉన్నారు.