Prashant Kishor: బీహార్ లో విద్యార్థులు, పోలీసుల మధ్య గొడవ.. ప్రశాంత్ కిశోర్‌పై కేసు
- 70వ కంబైన్డ్ కాంపిటెటివ్ ఎగ్జామ్ పేపర్ లీక్ ఆరోపణలు
- పరీక్షను మళ్లీ నిర్వహించాలంటూ అభ్యర్థుల ఆందోళన
- మద్దతు ప్రకటించిన ప్రశాంత్ కిశోర్
- హింసాత్మకంగా మారిన విద్యార్థుల నిరసన
- కోచింగ్ సెంటర్ల యజమానులతోపాటు 700 మంది ఆందోళనకారులపై కేసులు
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, ఆయన పార్టీ జన్‌సురాజ్ నేతలు, కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు, మరో 700 మంది గుర్తుతెలియని ఆందోళనకారులపై బీహార్‌లో కేసు నమోదైంది. అనధికారికంగా గుమికూడటం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం వంటి అభియోగాలు వారిపై నమోదయ్యాయి.
పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో 70వ కంబైన్డ్ కాంపిటెటివ్ ఎగ్జామ్‌ను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులు పాట్నాలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గాంధీ మైదాన్ వద్ద సమావేశమైన వారంతా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశం కావాలని భావించారు.
విద్యార్థుల ఆందోళనకు ప్రశాంత్ కిశోర్ మద్దతు ప్రకటించారు. వారి మార్చ్‌లో ఆయన కూడా పాల్గొన్నారు. విద్యార్థుల ప్రతినిధులు చీఫ్ సెక్రటరీని కలుస్తారని ప్రకటించారు. కానీ, విద్యార్థులు మాత్రం సీఎంను తప్ప మరెవరినీ కలిసేది లేదని తేల్చి చెప్పారు. దీంతో ఇది పోలీసు చర్యకు దారితీసింది. ఆ తర్వాత అది హింసాత్మకంగా మారింది. పోలీస్ లౌడ్ స్పీకర్లను విరగ్గొట్టిన ఆందోళనకారులు కలెక్టర్లు, పోలీసు అధికారులతో గొడవకు దిగారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కేనన్లు ఉపయోగించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆందోళనకారులు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు, నిరసనకారులపై పోలీసులు కేసు నమోదు చేశారు.