South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదం: ఇద్దరు తప్ప విమానంలోని అందరూ మృతి
- ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం
- విమానంలోని 175 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది సజీవ దహనం
- ల్యాండింగ్ గేర్, టైర్లు పనిచేయకపోవడమే కారణం!
- ఎయిర్‌పోర్టు మూసివేసిన అధికారులు
దక్షిణ కొరియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో అందులో ఉన్న ఇద్దరు తప్ప అందరూ మరణించారు. ప్రమాద సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులతోపాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో 179 మంది మరణించినట్టు యాంహాప్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి బయల్దేరిన ది జేజు ఎయిర్ ఫ్లైట్‌కు చెందిన 7సి2216 బోయింగ్ 737-800 విమానం దక్షిణ కొరియాలోని ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతూ అదుపుతప్పింది. విమానాశ్రయ రక్షణ గోడను ఢీకొని కాలిబూడిదైంది. విమానం ల్యాండింగ్ గేర్‌లో సమస్య కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. విమానం అంతకుముందే ల్యాండింగ్‌కు ప్రయత్నించి విఫలమైనట్టు అధికారులు తెలిపారు.
ల్యాండింగ్ తర్వాత విమానం రన్‌వే చివరికి వస్తున్నా వేగాన్ని నియంత్రించుకోలేక ఎయిర్ పోర్టు గోడను బలంగా ఢీకొట్టింది. దీంతో అందులోని ఇంధనం ఒక్కసారి మండిపోయి మంటలు వ్యాపించాయి. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న దాని ప్రకారం విమానం ల్యాండింగ్ సమయంలో గేర్, టైర్లు పని చేయలేదు. ఏదైనా పక్షి ఢీకొనడం వల్ల అవి పనిచేయకపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ఈ ఘోర విషాదంపై దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్ మోక్ స్పందించారు. అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని శాఖలకు మార్గదర్శకాలు, ఆదేశాలు జారీచేశారు. ప్రమాదం కారణంగా ముయాన్ ఎయిర్‌పోర్టును మూసివేశారు.