Jasprit Bumrah: మెల్‌బోర్న్ టెస్ట్: అత్యంత వేగంగా 200 వికెట్లు.. బుమ్రా మరో ఘనత

Indian Pacer Bumrah Reached 200 Wickets Club

  • ట్రావిస్ హెడ్‌ను అవుట్ చేయడం ద్వారా 200 వికెట్ల క్లబ్‌లోకి బుమ్రా
  • 44 టెస్టుల్లోనే 200 వికెట్ల మైలురాయిని అందుకున్న పేసర్
  • రవీంద్ర జడేజాతో కలిసి జాయింట్ రికార్డ్
  • ఈ జాబితాలో అగ్రస్థానంలో రవిచంద్రన్ అశ్విన్ 
  • 37 టెస్టుల్లోనే 200 వికెట్లు సాధించిన మాజీ ఆఫ్ స్పిన్నర్

టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరో ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 200 వికెట్లు పడగొట్టిన ఇండియన్ పేసర్‌గా రికార్డులకెక్కాడు. ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో నాలుగో రోజు ఆటలో ఈ రికార్డును తన పేరున రాసుకున్నాడు. గతంలో ఈ రికార్డు దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ పేరిట ఉండేది. 50 టెస్టు మ్యాచుల్లో కపిల్ ఈ రికార్డు సాధించాడు. 1983లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కపిల్ 200వ వికెట్ పడగొట్టాడు. 

బుమ్రా ఇప్పుడు 44 టెస్టుల్లోనే 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఫలితంగా అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఇండియన్ పేసర్‌గా రవీంద్ర జడేజాతో కలిసి రికార్డును పంచుకున్నాడు. ఇక, ఈ జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ అందరికంటే ముందున్నాడు. బ్రిస్బేన్ టెస్టు తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ 37 టెస్టుల్లోనే 200 వికెట్లు పడగొట్టాడు. 2016లో కాన్పూరులో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ ఈ ఘనత సాధించాడు. 

ఇక, ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో జరుగుతున్న టెస్టులో ట్రావిస్ హెడ్‌ను అవుట్ చేయడం ద్వారా బుమ్రా 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. కాగా, ఓవరాల్‌గా ఈ రికార్డు పాకిస్థాన్ స్పిన్నర్ యాసిర్ షా పేరును ఉంది. యాసిర్ 33 టెస్టుల్లోనే 200 వికెట్లు సాధించాడు. ఆస్ట్రేలియా పేసర్ డెన్నిస్ లిల్లీ 38 టెస్టుల్లో ఈ రికార్డు అందుకున్నాడు. 

  • Loading...

More Telugu News