Babar Azam: 733 రోజుల తర్వాత ఎట్టకేలకు ఓ ఫిఫ్టీ కొట్టిన బాబర్ అజామ్
- 2022 డిసెంబరు తర్వాత ఫామ్ కోల్పోయిన బాబర్ అజామ్
- కనీసం ఓ అర్ధసెంచరీ చేయలేక ఆపసోపాలు
- తాజాగా దక్షిణాఫ్రికాపై 85 బంతుల్లో 50 రన్స్ చేసిన బాబర్
క్రికెట్లో ఫామ్ అనేది చాలా కీలక అంశం. ఫామ్ లో ఉన్న బ్యాట్స్ మెన్ పరుగులు వెల్లువెత్తిస్తుంటారు... అదే ఫామ్ కోల్పోతే, సింగిల్ రన్ కొట్టలేక అష్టకష్టాలు పడుతుంటారు. అందుకు ఉదాహరణ... పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్.
గత రెండేళ్లుగా టెస్టుల్లో బాబర్ అజామ్ ఆటతీరు నానాటికీ తీసికట్టు అన్నట్టుగా సాగుతోంది. అతడి బ్యాట్ నుంచి ఒక్క అర్థ సెంచరీ కూడా రాలేదు. అయితే, అతడి పరుగుల కరవుకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. 733 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత బాబర్ అజామ్ ఓ ఫిఫ్టీ కొట్టాడు.
దక్షిణాఫ్రికాతో సెంచురియన్ లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో బాబర్ 85 బంతుల్లో 50 పరుగులు చేశాడు. 2022 డిసెంబరు తర్వాత బాబర్ సాధించిన తొలి అర్ధసెంచరీ ఇదే. చివరిగా కరాచీలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్టులో ఓ హాఫ్ సెంచరీ చేసిన బాబర్... మళ్లీ ఓ అర్ధసెంచరీ చేసేందుకు ఇన్నాళ్లు పట్టింది.
2016లో అరంగేట్రం చేసిన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ 56 టెస్టుల్లో 43.55 సగటుతో 4,051 పరుగులు సాధించాడు. వాటిలో 9 సెంచరీలు 27 అర్ధసెంచరీలు ఉన్నాయి.