Kadapa District: కడప జిల్లాలో ఘోరం.. భార్యాపిల్లలతో కలిసి ఉరి వేసుకున్న యువ రైతు

Kadapa Former Family Suicide

  • అప్పు చేసి చినీ తోట సాగు చేసిన యువరైతు
  • దిగుబడి సరిగా లేకపోవడంతో అప్పులు తీర్చలేక మనస్తాపం 
  • రుణదాతల ఒత్తిడి తట్టుకోలేక కుటుంబం సహా ఆత్మహత్య

వైఎస్సార్ కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ యువరైతు భార్యాపిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయం కోసం చేసిన అప్పులు తలకు మించిన భారం కావడం, దిగుబడి సరిగా రాకపోవడంతో అప్పులు తీర్చే మార్గంలేక తనువు చాలించాడు. భార్యాపిల్లలకు తన చేతులతోనే ఉరి బిగించి, తానూ ఉరి వేసుకున్నాడు. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

జిల్లాలోని సింహాద్రిపురం మండలం దిద్దెకుంట గ్రామానికి చెందిన యువరైతు నాగేంద్ర.. ఆయనకు భార్య వాణి, కూతురు గాయత్రి, కొడుకు భార్గవ్ ఉన్నారు. తమకున్న కొద్దిపాటి భూమిలోనే వ్యవసాయం చేస్తూ వారు జీవనం సాగిస్తున్నారు. చినీ తోట వేస్తే మంచి లాభాలు వస్తాయని భావించిన నాగేంద్ర.. అప్పులు చేసి మరీ సాగు చేశాడు. అయితే, దిగుబడి సరిగా రాకపోవడంతో నాగేంద్ర కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి.

ఓవైపు ఆదాయం లేక, మరోవైపు అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి పెరగడంతో నాగేంద్ర తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో భార్యాపిల్లలను తోటకు తీసుకెళ్లి వారికి ఉరి వేసి, తాను కూడా ఉరేసుకుని చనిపోయాడు. తోటలో మృతదేహాలను చూసి గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం తరలించి, నాగేంద్ర బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.

Kadapa District
Former
Family Suicide
Agriculture
Debts
  • Loading...

More Telugu News