Offbeat: ‘మా అత్త త్వరగా చనిపోవాలి’.. అంటూ దేవుడి హుండీలో నోటు
‘మా అత్త త్వరగా చనిపోవాలి’ అని 20 రూపాయల నోటుపై రాసి దేవుడి హుండీలో వేశారో భక్తురాలు/భక్తుడు. కర్ణాటకలోని కలబురగి జిల్లా అఫ్జలపుర తాలూకాలోని ఘత్తరగి గ్రామంలో జరిగిందీ ఘటన.
ఇక్కడ భాగ్యవంతి దేవి ఆలయంలో హుండీ లెక్కింపు సందర్భంగా ఈ నోటును సిబ్బంది గుర్తించారు. ‘మా అత్త త్వరగా చనిపోవాలి’ అని రాసి ఉన్న నోటు చూసి అవాక్కయిన సిబ్బంది దానిని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
అయితే, అత్తయ్య చనిపోవాలని కోరుకుంటున్నది ఎవరై ఉంటారన్న చర్చ మొదలైంది. అలా రాసింది అల్లుడా? కోడలా? అని స్థానికులు చర్చించుకుంటున్నారు. కాగా, ఏడాదికోసారి లెక్కించే భాగ్యవంతి ఆలయానికి ఈసారి రూ. 60 లక్షల నగదు, కిలో వెండి వస్తువులు కానుకల రూపంలో వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు.