New Year Wishes: ‘న్యూ ఇయర్ విషెస్’ పేరుతో నయా మోసం.. అప్రమత్తంగా లేకుంటే ఖాతా ఖాళీ!
- రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు
- న్యూ ఇయర్ విషెస్, ఈవెంట్ పాస్‌లు అంటూ ఊరింపు
- లింక్‌పై క్లిక్ చేస్తే నేరగాళ్ల నియంత్రణలోకి ఫోన్
- ఆపై బ్యాంకు ఖాతా ఖాళీ.. బ్లాక్‌మెయిలింగ్
- అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్ క్రైం పోలీసులు
సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. న్యూ ఇయర్ వేళ సరికొత్త మోసానికి తెరతీశారు. విషెస్ చెబుతూ అందినకాడికి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. న్యూ ఇయర్ శుభాకాంక్షలు వచ్చాయి కదా అని వాటిపై క్లిక్ చేస్తే మీ బ్యాంక్ ఖాతా గుల్ల కావడం ఖాయం. కాబట్టి అపరిచిత వ్యక్తుల నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు, డిస్కౌంట్ల పేరిట లింకులు వస్తే తొందరపడొద్దు. వాటిని క్లిక్ చేసి జేబులు గుల్ల చేసుకోవద్దు.
న్యూఇయర్ విషెస్, డిస్కౌంట్ కూపన్లు, భారీ ఆఫర్లు, ఈవెంట్ పాస్‌ల పేరుతో బోగస్ లింకులను పంపి కేటుగాళ్లు మోసానికి పాల్పడుతున్నట్టు సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. నేరగాళ్లు పంపించే లింకులను క్లిక్ చేస్తే ఫోన్ హ్యాక్ అవుతుందని, ఆ మెసేజ్‌ను వేరేవారికి ఫార్వార్డ్ చేస్తే వారు కూడా నేరగాళ్ల బారినపడతారని చెబుతున్నారు. బాధితులకు ఎలాంటి అనుమానం రాకుండా నేరగాళ్లు ప్రముఖ సంస్థల పేరుతో ఈవెంట్ పాస్‌లు పంపుతున్నారు. వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా తక్కువ ధరకే ఈవెంట్ పాస్ పొందవచ్చని ఊరిస్తారు.
యూజర్లు ఆవేశపడి లింక్‌పై క్లిక్ చేస్తే వెంటనే ఫోన్ వారి నియంత్రణలోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత బ్యాంకు ఖాతాలోని సొమ్ము మాయమవుతుంది. ఆ తర్వాత కూడా నేరగాళ్లు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి విషెస్ వస్తే వాటిపై క్లిక్ చేయవద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.