professor: తిరుపతిలో విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించిన ప్రొఫెసర్ అరెస్ట్
- విద్యార్ధినులపై వక్రబుద్ది ప్రదర్శిస్తున్న అధ్యాపకులు
- విద్యార్ధినిపై లైంగికదాడికి పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయిన తిరుపతి శ్రీవెంకటేశ్వర వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్
- మొబైల్ ఫోన్ లో రికార్డయిన ప్రొఫెసర్ నిర్వాకం
- ప్రొఫెసర్ ఉమా మహేశ్‌ను అరెస్టు చేసిన పోలీసులు
అధ్యాపక వృత్తి ఎంతో గౌరవ ప్రదమైనది. సమాజంలో గురువుకు ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం ఉంటుంది. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. అంటే దైవం కంటే ముందు గురువుకు స్థానం ఉంది. ఇంతటి గొప్ప స్థానంలో ఉన్న గురువులు (అధ్యాపకులు) కొందరు వక్ర బుద్దితో విద్యార్థినులపై లైంగిక దాడులకు పాల్పడుతూ గురువు స్థానానికి కళంకం తెస్తున్నారు.
ఇటీవల కాలంలో పాఠశాలలు, కళాశాలలో విద్యార్థినుల పట్ల అధ్యాపకులు చేస్తున్న అకృత్యాలు అనేకం వెలుగు చూశాయి. విద్యార్ధుల పేరెంట్స్ తప్పు చేసిన అధ్యాపకుడికి దేహశుద్ధి చేసిన ఘటనలూ ఉన్నాయి. వక్ర బుద్ధితో వ్యవహరిస్తున్న అధ్యాపకులు కేసులతో కటకటాల పాలవుతున్నారు. తాజాగా తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో విద్యార్ధినిపై వేధింపుల కేసు వెలుగులోకి వచ్చింది.
విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ప్రొఫెసర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కళాశాలలో మొదటి సంవత్సరం బ్యాక్ లాగ్ విద్యార్ధిని తిరిగి ప్రవేశం పొంది తరగతులకు హాజరవుతుండగా, ఆ విద్యార్ధిని పట్ల క్రాప్ ఫిజియోలజీ విభాగాధిపతి ఉమా మహేశ్ తరగతిలోనే అసభ్యంగా ప్రవర్తించాడు.
ఈ దృశ్యాలు మొబైల్ ఫోన్‌లో రికార్డు అయ్యాయి. ఒంటరిగా ఉన్న విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేసిన సదరు ప్రొఫెసర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూనివర్శిటీ ఫ్లై ఓవర్ వద్ద ప్రొఫెసర్ ఉమా మహేశ్‌ను అరెస్టు చేసినట్లు తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవిందు మీడియాకు తెలిపారు.