Nimmala Rama Naidu: ఆ ధర్నాలేవో జగన్ ఇంటి ముందు చేయండి: మంత్రి నిమ్మల
- విద్యుత్ చార్జీలు పెంచారంటూ ధర్నాలు చేస్తున్న వైసీపీ నేతలు
- జగన్ హయాంలో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారన్న మంత్రి నిమ్మల
- తానే చార్జీలు పెంచి తానే ధర్నా చేస్తున్న వ్యక్తి జగన్ అంటూ విమర్శలు
జగన్ హయాంలో తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తాను పెంచిన విద్యుత్ చార్జీలపై తానే ధర్నా చేస్తున్న వ్యక్తి జగన్ అని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం ప్రజల నెత్తిన విద్యుత్ చార్జీల బండ వేసిందంటూ వైసీపీ నేతలు ధర్నాలు చేస్తుండడం పట్ల నిమ్మల తీవ్రస్థాయిలో స్పందించారు. విద్యుత్ చార్జీలు పెంచింది జగనే కాబట్టి, ఆ ధర్నాలేవో జగన్ ఇంటి ముందు చేయాలని వైసీపీ నేతలకు సూచించారు.
విద్యుత్ చార్జీల పేరుతో ప్రజలపై రూ.16 వేల కోట్ల భారం మోపారని విమర్శించారు. మరోవైపు డిస్కంలపై రూ.18 వేల కోట్ల బకాయిల భారం పడిందని, అది ఇప్పుడు ప్రజలపై ప్రభావం చూపుతోందని అన్నారు.
కమీషన్లకు కక్కుర్తిపడి అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేశారని మంత్రి నిమ్మల ఆరోపించారు. 2014-19 కాలంలో ఏపీని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు.