Anna Hazare: ప్రజలకు ఏం చేయాలని మన్మోహన్ ఎప్పుడూ ఆలోచిస్తుండేవారు: అన్నా హజారే
- దేశ అభ్యున్నతికి మన్మోహన్ ప్రాధాన్యత ఇచ్చారన్న అన్నా హజారే
- దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపించారని కితాబు
- ఆయన మన మనసుల్లో చిరకాలం నిలిచి ఉంటారని వ్యాఖ్య
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే సంతాపాన్ని ప్రకటించారు. దేశ అభ్యున్నతికి, సమాజ సంక్షేమానికి మన్మోహన్ ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. పుట్టినవారంతా మరణిస్తారని... కానీ, వారు చేసిన గొప్ప పనులు, వారసత్వం మాత్రం మిగిలిపోతాయని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను మన్మోహన్ చూపించారని కొనియాడారు.
2010లో తాము అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టినప్పుడు తనను మన్మోహన్ చర్చలకు ఆహ్వానించారని అన్నా హజారే గుర్తు చేసుకున్నారు. అవినీతిని వ్యతిరేకించిన మన్మోహన్... లోక్ పాల్, లోకాయుక్త చట్టాలకు సంబంధించి వెంటనే నిర్ణయాలు తీసుకున్నారని కితాబిచ్చారు. అనునిత్యం దేశానికి, దేశ ప్రజలకు ఏం చేయాలనే దానిపై ఆలోచించేవారని చెప్పారు. మన్మోహన్ భౌతికంగా దూరమైనా... మన మనసుల్లో చిరకాలం నిలిచి ఉంటారని అన్నారు.