JC Prabhakar Reddy: నన్ను పట్టుకుని వదిన కన్నీళ్లు పెడుతోంది: జేసీ ప్రభాకర్ రెడ్డి

JC Prabhakar Reddy on fly ash issue

  • ఫ్లై యాష్ అనేది నా పుట్టగోసిలాంటిదన్న జేసీ
  • న్యాయం చేయమని డీజీపీ స్థాయి వరకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన
  • జరుగుతున్న పరిణామాలతో తమ కుటుంబ సభ్యులు నలిగిపోతున్నారన్న జేసీ

డబ్బుల కోసం పార్టీలో చేరారంటూ కొందరు మాట్లాడుతున్నారని... అసలు తమ గురించి ఏమనుకుంటున్నారని టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. 1951లోనే తాము మద్రాసులో చదువుకున్నామని... ఖరీదైన కార్లలో తాము ఎప్పుడో తిరిగామని చెప్పారు. ఫ్లై యాష్ అనేది తన పుట్టగోసిలాంటిదని అన్నారు. ఫ్లై యాష్ గొడవ కేవలం తమ ప్రిస్టేజ్ ఇష్యూ మాత్రమేనని చెప్పారు. తమకు కూడా చీము, నెత్తురు ఉంటుందని అన్నారు. 

తమకు న్యాయం చేయమని ఎస్పీ నుంచి డీజీపీ స్థాయి అధికారుల వరకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని జేసీ ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎవరికీ తల వంచమని... చేతకాకపోతే కుటుంబం కోసం క్లీనన్ పని చేసైనా బతుకుతామని చెప్పారు. 

పార్టీ అధ్యక్షుడి నుంచి మంత్రుల వరకు ఎవరికి లేఖలు రాసినా పట్టించుకోరని జేసీ అన్నారు. వైసీపీ హయాంలో తనను జైల్లో పెట్టి ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని చెప్పారు. వైసీపీలోకి రావాలని గతంలో ఒత్తిడి వచ్చినా వెళ్లలేదని... వైసీపీకి లొంగకపోవడం వల్లే బస్సులు సీజ్ చేశారని అన్నారు. వైసీపీ హయాంలో పొగరును వదిలేసి, ప్రిస్టేజ్ కు పోకుండా ఉంటే ఏ సమస్య ఉండేది కాదని చెప్పారు. ఏం జరిగినా తమ నాయకుడు చంద్రబాబును నమ్ముకుని ఆయన వెంట నడిచానని తెలిపారు.

జరుగుతున్న పరిణామాలతో తన భార్య, పిల్లలు పవన్ రెడ్డి, అస్మిత్ రెడ్డి నలిగిపోయారని జేసీ అన్నారు. వదిన తనను పట్టుకుని కన్నీళ్లు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన అన్న దివాకర్ రెడ్డి మానసిక వేదన అనుభవిస్తూ అనారోగ్యానికి గురయ్యారని చెప్పారు.

కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతంలోని బుగ్గ వద్ద ఉన్న ఎల్ అండ్ టీ సిమెంట్ ఫ్యాక్టరీకి ఫ్లై యాష్ రవాణా విషయంలో... జేసి ప్రభాకర్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గాల మధ్య వివాదం నెలకొంది. తమ నియోజకవర్గంలో జరిగే పనులు తమ ఆధీనంలో ఉండాలని ఆదినారాయణరెడ్డి అంటున్నారు. కానీ, తాడిపత్రి నియోజకవర్గంలోని సిమెంట్ ఫ్యాక్టరీకి ఫ్లై యాష్ ను జేసీ వర్గీయులు తరలిస్తున్నారు. ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదరకపోవడంతో వివాదం ముదిరింది. 

ఇరువురూ కూటమి నేతలే కావడంతో ప్రభుత్వంలో ఇది చర్చనీయాంశంగా మారింది. దీంతో, ఇద్దరూ వచ్చి తనను కలవాలని చంద్రబాబు చెప్పారు. చంద్రబాబును ఆదినారాయణరెడ్డి కలిసి వివరణ ఇచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం చంద్రబాబును కలవలేదు. ఇది టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

  • Loading...

More Telugu News