Tammareddy Bharadwaja: సైలెంట్‌గా సినిమా చూసి వస్తే ఈ ఘటన జరిగి ఉండేది కాదు.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై తమ్మారెడ్డి

Tammareddy Responds Over Sandhya Theatre Stampede Issue
  • నాలుగు కార్లలో వెళ్లాలని, రోడ్ షో చేయాలని అనుకోవడమే ఇలాంటి వాటికి కారణమన్న తమ్మారెడ్డి
  • గతంలో చిరంజీవి, బాలకృష్ణ వంటివారు హడావుడి లేకుండా అభిమానులతో కలిసి చూశారన్న నిర్మాత
  • కలెక్షన్లతో కాకుండా పెర్ఫార్మెన్స్ పరంగా తెలుగు వారికి గర్వకారణంగా నిలవాలని హీరోలకు సూచన
  • హీరోలు కూడా మనుషులేనని అనుకుంటే ఇలాంటి ఘటనలు జరగవన్న భరద్వాజ
పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. హీరోలు ఎక్కడికి వెళ్లినా నాలుగు కార్లలో వెళ్లాలని, రోడ్ షో చేయాలని భావిస్తున్నారని, ఈ మధ్య కాలంలో ఇలాంటివి సర్వ సాధారణంగా మారిపోయాయని విమర్శించారు. సైలెంట్‌గా వెళ్లి సినిమా చూసి వచ్చేస్తే ఇలాంటి ఘటనలు జరగడానికి ఆస్కారం ఉండదని అభిప్రాయపడ్డారు.

గతంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలు కూడా అభిమానులతో కలిసి సినిమాలు చూసేందుకు వెళ్లేవారని, కాకపోతే వారు తగిన జాగ్రత్తలు తీసుకునే వారని గుర్తుచేశారు. వారు సైలెంట్‌గా ఏదో ఒక మల్టిప్లెక్స్‌కు వెళ్లి సినిమా చూసేవారని, బయటకు వచ్చే సమయంలో అక్కడున్న వారితో కాసేపు ముచ్చటించేవారని తెలిపారు. సింగిల్ స్క్రీన్ థియేటర్‌కు వెళ్లాల్సి వచ్చినా ఇదే ఫాలో అయ్యేవారని తెలిపారు.

సోషల్ మీడియా వల్ల ఏ హీరో ఎక్కడ ఉంటున్నాడన్న విషయం ఇప్పుడు అభిమానులకు తెలిసిపోతోందని తమ్మారెడ్డి అన్నారు. దీంతో వారిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నట్టు చెప్పారు. ఫ్యాన్స్, ప్రజా శ్రేయస్సు కోసం కూడా హీరోలు ఆలోచించాలని సూచించారు. హీరోలు ఎంత అడిగితే అంత ఇవ్వడానికి నిర్మాతలు కూడా సిద్ధమవుతున్నారని తెలిపారు. దీంతో టికెట్ రేట్లు పెంచి ప్రజల మీద భారం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్షన్ల పరంగా కాకుండా పెర్ఫార్మెన్స్ పరంగా తెలుగు వారికి గర్వకారణంగా నిలవాలన్న విషయాన్ని హీరోలు అర్థం చేసుకోవాలని కోరారు. హీరోలు కూడా సాధారణ మనుషులేనని భావిస్తే ఇలాంటి హడావుడి ఉండదని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు.
Tammareddy Bharadwaja
Sandhya Theatre Stampade
Allu Arjun
Tollywood

More Telugu News