Amitabh Bachchan: అల్లు అర్జున్ ట్యాలెంటెడ్ యాక్టర్.. ఆయనతో నన్ను పోల్చొద్దు: అమితాబ్ బచ్చన్
- 'కౌన్ బనేగా కరోడ్ పతి' కార్యక్రమంలో అమితాబ్ వ్యాఖ్యలు
- అన్ని గుర్తింపులకు అల్లు అర్జున్ అర్హుడన్న అమితాబ్
- 'పుష్ప-2' సినిమా ఘన విజయం సాధించిందని ప్రశంస
స్టార్ హీరో అల్లు అర్జున్ పై బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ ఎంతో ప్రతిభావంతుడు అని బిగ్ బీ కొనియాడారు. 'కౌన్ బనేగా కరోడ్ పతి' షోలో ఓ కంటెస్టెంట్ తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
'కౌన్ బనేగా కరోడ్ పతి' సీజన్-16 ప్రస్తుతం కొనసాగుతోంది. తాజా ఎపిసోడ్ కు కోల్ కతా నుంచి ఓ గృహిణి కంటెస్టెంట్ గా వచ్చారు. ఆమె మాట్లాడుతూ... తనకు అమితాబ్ బచ్చన్, అల్లు అర్జున్ అంటే ఇష్టమని చెప్పారు. దీనిపై అమితాబ్ స్పందిస్తూ... తనకు వచ్చిన అన్ని గుర్తింపులకు అల్లు అర్జున్ అర్హుడని అన్నారు. 'పుష్ప-2' చిత్రం ఘన విజయం సాధించిందని... ఎవరైనా ఆ సినిమాను చూడకపోతే వెంటనే చూడాలని చెప్పారు. అల్లు అర్జున్ చాలా ట్యాలెంటెడ్ యాక్టర్ అని... ఆయనతో తనను పోల్చవద్దని అన్నారు.
ఈ క్రమంలో సదరు మహిళా కంటెస్టెంట్ మాట్లాడుతూ... కొన్ని సన్నివేశాల్లో మీ ఇద్దరి మేనరిజం ఒకే విధంగా ఉంటుందని చెప్పారు. ఈ షో ద్వారా మిమ్మల్ని కలుసుకున్నానని... ఏదో ఒక రోజు అల్లు అర్జున్ ను కూడా చూస్తే తన కల నెరవేరుతుందని అన్నారు.