Manmohan Singh: మన్మోహన్ మృతిపై చిరంజీవి, కమలహాసన్ స్పందన
- దేశంలోని గొప్ప రాజనీతిజ్ఞుల్లో మన్మోహన్ ఒకరన్న చిరంజీవి
- ఆయన హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని వ్యాఖ్య
- దేశ రాజకీయాల్లో ఒక శకం ముగిసిందన్న కమలహాసన్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ... దేశంలోని గొప్ప రాజనీతిజ్ఞుల్లో మన్మోహన్ ఒకరని కొనియాడారు. ఉన్నత విద్యావంతులు, మృదుస్వభావి, వినయంగా ఉండే నాయకుడని అన్నారు. రెండు సార్లు ప్రధానిగా ఉండి దేశ చరిత్రలో నిలిచిపోయే మార్పులు తీసుకొచ్చారని చెప్పారు.
మన్మోహన్ లాంటి గొప్ప నాయకుడి హయాంలో పార్లమెంట్ సభ్యుడిగా, పర్యాటకశాఖ సహాయమంత్రిగా పని చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని చిరంజీవి అన్నారు. ఆయన నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నానని చెప్పారు. మన్మోహన్ మృతి దేశానికి తీరని లోటు అని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.
కమలహాసన్ స్పందిస్తూ... దేశం గొప్ప పండితుడిని కోల్పోయిందని అన్నారు. మన్మోహన్ మృతితో దేశ రాజకీయాల్లో ఒక శకం ముగిసిందని చెప్పారు. తన దూరదృష్టితో కూడిన ఆర్థిక, సామాజిక విధానాలతో దేశాన్ని పునర్నిర్మించారని కొనియాడారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎంతో మందికి ఉపయోగపడ్డాయని చెప్పారు. ఆయన వారసత్వం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. మన్మోహన్ మృతికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.