Annamalai: కొరడాతో కొట్టుకున్న బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై.. ఇదిగో వీడియో!
- అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన
- ఈ ఘటనపై డీఎంకే ప్రభుత్వ తీరును నిరసిస్తూ అన్నామలై వినూత్న నిరసన
- చొక్కా విప్పి కొరడాతో ఆరుసార్లు కొట్టుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
- డీఎంకేను గద్దె దించేవరకూ చెప్పులు కూడా వేసుకోనని శపథం
తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కొరడాతో కొట్టుకున్నారు. ఇటీవల అన్నా విశ్వవిద్యాలయంలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటనపై డీఎంకే ప్రభుత్వ తీరుతీరును నిరసిస్తూ ఆయన ఇలా చేశారు. చొక్కా విప్పి కొరడాతో ఆరుసార్లు కొట్టుకున్నారు. శుక్రవారం ఉదయం తన నివాసం ముందు చేసిన ఈ వినూత్న నిరసన తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
మరోవైపు డీఎంకేను గద్దె దించే వరకు తాను చెప్పులు వేసుకోనంటూ అన్నామలై గురువారం నాడు మీడియా సమావేశంలో శపథం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గురువారం విలేకరుల సమావేశంలో అన్నామలై మాట్లాడుతూ.. రాష్ట్రంలో పిల్లలు, స్త్రీలకు భద్రత లేదన్నారు. యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి డీఎంకే వ్యక్తేనని ఆరోపించారు. అందుకే డీఎంకేను అధికారం నుంచి దించేవరకూ చెప్పులు కూడా వేసుకోనని శపథం చేశారు. అలాగే శుక్రవారం నుంచి 48 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తానన్నారు. తన ఇంటి ముందు ఆరు కొరడా దెబ్బలు కూడా కొట్టుకుంటానని పేర్కొన్నారు. చెప్పినట్టే ఇవాళ అన్నామలై కొరడాతో కొట్టుకున్నారు.