Gurukula school building: పాఠశాల భవన నిర్మాణానికి ఐదెకరాలు రాసిచ్చి దాతృత్వాన్ని చాటుకున్న మహిళా రైతు

A woman farmer donated land for the construction of Gurukula school building

  • అనంతపురం జిల్లా కుందుర్పి గ్రామంలో గురుకుల పాఠశాలకు భవనం లేక ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు
  • తహసీల్దార్‌కు అంగీకార పత్రం అందించిన మహిళా రైతు గంగమ్మ
  • పిల్లకాయల ఇబ్బందులు చూడలేక ఐదెకరాలు ఇవ్వడానికి ముందుకొచ్చానన్న గంగమ్మ 

గ్రామంలో పాఠశాల భవనం కోసం ఓ మహిళా రైతు తన ఐదెకరాలు భూమి వితరణ చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. అనంతపురం జిల్లా కుందుర్పి గ్రామంలో ఆరేళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వ హయాంలో మహాత్మా జ్యోతిబా పులే గురుకుల పాఠశాలను మంజూరు చేసింది. అయితే మూతపడిన ఓ బాలుర వసతి గృహంలో తరగతులు ప్రారంభించారు. ఇరుకు గదుల్లో విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల భవన నిర్మాణాలకు అవసరమైన స్థలం లేకపోవడంతో మంజూరైన నిధులు వెనక్కి వెళ్లాయి. 

గత ఏడాది అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్ గురుకుల పాఠశాలను వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేయగా, టీడీపీ, సీపీఐ, బీజేపీ నేతలు నిరసనలు చేపట్టడంతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. ప్రస్తుత కల్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుని భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చిన నేపథ్యంలో గ్రామానికి చెందిన మహిళా రైతు పామురాతి గంగమ్మ గురుకుల పాఠశాల కోసం ఐదెకరాలు భూమి వితరణగా ఇవ్వడానికి ముందుకు వచ్చింది. 

నిన్న తన కుమారుడు శరత్, మండల టీడీపీ అధ్యక్షుడు ధనుంజయ, కుందుర్పి సాగునీటి సంఘం అధ్యక్షుడు రామమూర్తి, పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తదితరులతో కలిసి తహసీల్దార్  శ్రీనివాసులుకు అంగీకార పత్రాన్ని గంగమ్మ అందించారు. విద్యార్ధులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పడుతున్న ఇబ్బందులు చూడలేక, తమ ప్రాంత పిల్లకాయల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 5 ఎకరాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు గంగమ్మ తెలిపారు. దీనిపై తహసీల్దార్ మాట్లాడుతూ .. స్థల దానం విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు.

  • Loading...

More Telugu News