Manmohan Singh: మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరనిలోటు: ఏపీ సీఎం చంద్రబాబు
- ఢిల్లీలో నేడు కన్నుమూసిన మన్మోహన్ సింగ్
- తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు
- మన్మోహన్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం
భారత మాజీ ప్రధాని, దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. భారత మాజీ ప్రధాని, పేరెన్నికగన్న ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ఇక లేరని తెలిసి తీవ్ర విచారానికి గురయ్యానని చంద్రబాబు తెలిపారు. మేధావి, రాజనీతిజ్ఞుడు అయిన మన్మోహన్ సింగ్ వినయానికి, విజ్ఞానానికి, సమగ్రతకు ప్రతిరూపం అని అభివర్ణించారు.
1991లో ఆర్థికమంత్రిగా ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చినప్పటి నుంచి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించే వరకు దేశానికి అవిశ్రాంతంగా సేవలు అందించారని, కోట్లాది మంది ప్రజల జీవితాలను దారిద్ర్యం నుంచి బయటికి తీసుకువచ్చారని కొనియాడారు.
ఆయన మృతి దేశానికి తీరనిలోటు అని పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి, సన్నిహితులు, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నానని చంద్రబాబు వివరించారు.