Manmohan Singh: దేశం దుఃఖిస్తోంది... మన్మోహన్ మృతిపై ప్రధాని మోదీ స్పందన
- మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత
- భారతదేశ విశిష్ట నేతల్లో ఒకరంటూ మోదీ ట్వీట్
- దేశ ఆర్థికరంగంపై బలమైన ముద్ర వేశారని కితాబు
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విశిష్ట నేతల్లో ఒకరైన మన్మోహన్ కన్నుమూయడం పట్ల దేశం దుఃఖిస్తోంది అంటూ మోదీ ట్వీట్ చేశారు. నిరాడంబరమైన కుటుంబం నుంచి వచ్చి ఎంతో ఎత్తుకు ఎదిగిన మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్నారని మోదీ కొనియాడారు.
ఆర్థిక మంత్రి సహా, వివిధ హోదాల్లో పనిచేశారని, అనేక ఏళ్లుగా మన దేశ ఆర్థిక రంగంపై ఆయన బలమైన ముద్ర వేశారని కీర్తించారు. పార్లమెంటు సభ్యుడిగా, ఏదైనా అంశంలో జోక్యం చేసుకున్నారంటే అందులో ఎంతో వివేకంతో కూడిన ఆలోచన ఉండేదని మోదీ వివరించారు. ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు మన ప్రధానిగా ఆయన విస్తృతమైన కృషి చేశారని కొనియాడారు.
మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో తాను గుజరాత్ సీఎంగా ఉన్నానని, ఆ సమయంలో తనతో క్రమం తప్పకుండా మాట్లాడేవారని మోదీ గుర్తుచేసుకున్నారు. పాలనకు సంబంధించి అనేక అంశాలపై తాము మాట్లాడుకునేవారమని, ఆయన మాటలో విజ్ఞానం, నడవడికలో వినయం కనిపించేవని తెలిపారు.
ఈ విషాద సమయలో ఆయన కుటుంబానికి, శ్రేయోభిలాషులకు, సన్నిహితులకు, అసంఖ్యాక అభిమానులకు సంతాపం తెలియజేసుకుంటున్నానని మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.