Atchannaidu: ట్రూఅప్ చార్జీల కర్త, కర్మ, క్రియ అన్నీ జగనే: మంత్రి అచ్చెన్నాయుడు
- ఏపీలో విద్యుత్ చార్జీల భారం మోపారంటూ వైసీపీ నిరసనలు
- విద్యుత్ చార్జీల పెరుగుదలకే జగనే కారణమన్న అచ్చెన్నాయుడు
- జగన్ చేసిన పాపాలు నేడు శాపాలుగా మారాయని విమర్శలు
ఏపీలో కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచుతూ, అధిక బిల్లులతో ప్రజల నెత్తిన భారం మోపుతోందని వైసీపీ నిరసనలు చేపడుతుండడం తెలిసిందే. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు.
రాష్ట్రంలో కరెంటు ట్రూఅప్ చార్జీల కర్త, కర్మ, క్రియ అన్నీ జగనే అని ఆరోపించారు. విద్యుత్ చార్జీల పెరుగుదలకే జగనే కారణమని స్పష్టం చేశారు. జగన్ గత ఐదేళ్ల పాలనలో విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.
నాడు ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపి... నేడు ధర్నాలు, ర్యాలీలు చేయడం సిగ్గుచేటని అచ్చెన్నాయుడు విమర్శించారు. యూనిట్ విద్యుత్ రూ.5కే వస్తున్నా జగన్ కొనలేదని, కమీషన్లకు కక్కుర్తిపడి యూనిట్ విద్యుత్ రూ.8కి కొన్నారని వివరించారు. జగన్ చేసిన పాపాలు నేడు శాపాలుగా మారాయని అన్నారు.