Unicorn-2025: హోండా పాత యూనికార్న్ కు 2025 మోడల్ కు తేడా ఇదే!

Honda brings 2025 model Unicorn compliance with OBD2B norms

  • భారత్ లో యూనికార్న్ కొత్త వెర్షన్ తీసుకువచ్చిన హోండా
  • పూర్తి స్థాయి డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ తో 2025 మోడల్
  • పాత వెర్షన్ తో పోల్చితే ధర రూ.8,180 పెంపు
  • ఎక్స్ షోరూమ్ ప్రైస్ రూ.1,11,301

జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం హోండా భారత్ లో 2025 మోడల్ యూనికార్న్ బైక్ ను తీసుకువచ్చింది. ఆన్ బోర్డ్ డయాగ్నస్టిక్స్ భారత్- 2 (OBD2B) ప్రమాణాలకు అనుగుణంగా ఈ బైక్ ను తీర్చిదిద్దారు. కొత్త యూనికార్న్ లో డిజైన్ పరంగానూ స్వల్ప మార్పులు చేశారు. ఇందులో క్రోమ్ ఫినిషింగ్ తో కూడిన ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ ను ఇచ్చారు. 

పాత మోడల్ తో పోల్చి చూస్తే, ఇందులో పూర్తిస్థాయి డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఏర్పాటు చేశారు. బండి వేగం, ఏ గేర్ లో నడుపుతున్నాం, బండి ఏ మోడ్ లో డ్రైవ్ చేస్తున్నాం, సర్వీస్ అలెర్ట్ వంటివి ఈ డిజిటల్ క్లస్టర్ లో డిస్ ప్లే అవుతాయి. ఇక, మిగతా పార్ట్ లన్నీ పాత యూనికార్న్ డిజైన్ లోనివే కంటిన్యూ చేశారు. 

2025 యూనికార్న్ బైక్ మూడు కలర్ ఆప్షన్స్ లో వస్తోంది. రేడియంట్ రెడ్ మెటాలిక్, మాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, పెర్ల్ ఇగ్నీయస్ బ్లాక్ రంగుల్లో నయా యూనికార్న్ అందుబాటులోకి రానుంది. పాత యూనికార్న్ లో కనిపించే పెర్ల్ సైరెన్ బ్లూ పెయింట్ స్కీమ్ నయా యూనికార్న్ నుంచి కంపెనీ తొలగించినట్టు అర్థమవుతోంది. 

పాత వెర్షన్ కంటే కొత్త యూనికార్న్ ఇంజిన్ పరంగా శక్తిమంతమైనదని తెలుస్తోంది. ఇందులో 167.71 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ అమర్చారు. ఇది 14.58 ఎన్ఎం టార్క్ వద్ద 13 బీహెచ్ పీ శక్తిని వెలువరిస్తుంది. 

కొత్త మోడల్ కు తగ్గట్టుగానే ధర కూడా రూ.8,180 మేర భారీగా పెరిగింది. 2025 మోడల్ యూనికార్న్ బైక్ ధర రూ.1,11,301 అని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ఇది ఎక్స్ షోరూమ్ ధర. అదనపు యాక్సెసరీస్ తో కూడా కలుపుకుని ఆన్ రోడ్ ప్రైస్ 1.20 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News