Sri Tej: సినిమా వారిని భయపెట్టి మంచి చేసుకోవాలనుకోవద్దు: రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఆగ్రహం

Harish Rao targets Revanth Reddy over tollywood

  • శ్రీతేజ్‌ను పరామర్శించిన హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు
  • శ్రీతేజ్ తండ్రి భాస్కర్‌కు మనోధైర్యం ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించారని హరీశ్ వెల్లడి
  • సంధ్య థియేటర్ ఘటనను ప్రభుత్వం రాజకీయం చేస్తుందని విమర్శ

సినిమా వాళ్లను భయపెట్టడం ద్వారా మంచి చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించడం సరికాదని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు హితవు పలికారు. పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కొడుకు శ్రీతేజ్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సికింద్రాబాద్‌లోని కిమ్స్‌లో ఉన్న శ్రీతేజ్‌ను హరీశ్ రావు సహా బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు.

అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ... శ్రీతేజ్‌కు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు కిమ్స్ డాక్టర్లు చెప్పారన్నారు. అతను త్వరగా కోలుకోవాలని కోరుకున్నట్లు చెప్పారు. శ్రీతేజ్ తండ్రి భాస్కర్‌కు మనోధైర్యం ఇవ్వాలని కేసీఆర్ చెప్పారని వివరించారు. రేవతి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నామన్నారు. సంధ్య థియేటర్ ఘటనను ప్రభుత్వం రాజకీయం చేస్తుందని విమర్శించారు.

గురుకులాలు, హాస్టళ్లలో మృతి చెందిన వారి కుటుంబాలను సీఎం ఎందుకు పరామర్శించడం లేదని హరీశ్ రావు ప్రశ్నించారు. ఓ మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడని, అందుకు కారణమైన తన సోదరుడిని సీఎం ఎందుకు అరెస్ట్ చేయించలేదని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమేనని సీఎం చెబుతున్నారని, మరి తన సోదరుడిపై చర్యలు ఏవి? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News