YS Sharmila: టీడీపీ, జనసేనలు కేంద్రానికి గులాంగిరి చేస్తున్నాయి: షర్మిల
- వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ఆదుకోవడం లేదన్న షర్మిల
- మిట్టల్ స్టీల్ గురించి చంద్రబాబు చర్చిస్తున్నారని విమర్శ
- వైజాగ్ స్టీల్ ను సెయిల్ లో విలీనం చేయాలని డిమాండ్
కేంద్ర ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. 243 మంది పని చేసే కర్ణాటక స్టీల్ ప్లాంట్ కు పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి... 26 వేల మంది పని చేసే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ఆదుకోవడానికి మాత్రం మనసు రావడం లేదని దుయ్యబట్టారు. ఇద్దరు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న జేడీఎస్ రూ. 15 వేల కోట్ల నిధులు రాబట్టిందని... కేంద్రంలోని ఎన్డీయేకు ఊపిరి పోసిన టీడీపీ, జనసేన పార్టీలు మాత్రం కేంద్రానికి గులాంగిరి చేస్తున్నాయని విమర్శించారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ఆదుకోవాలని కోరుతూ 1,400 రోజులుగా కార్మికులు ఉద్యమాలు చేస్తుంటే సీఎం చంద్రబాబు మాత్రం ప్రధానితో మిట్టల్ స్టీల్ గురించి చర్చిస్తున్నారని షర్మిల విమర్శించారు. మిట్టల్ పెట్టబోయే ప్లాంట్ కు ఇనుప ఖనిజం కొరత లేకుండా చూడాలని కోరుతున్నారని... ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కు న్యాయం జరగకపోతే ఎన్డీయే నుంచి టీడీపీ, జనసేన బయటకు రావాలని డిమాండ్ చేశారు.