Low Pressure: బలహీనపడిన అల్పపీడనం.... అయినప్పటికీ వర్షాలే!
- పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
- ఉత్తర తమిళనాడు-దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరువలో ఉందన్న ఐఎండీ
- దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడి
నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం నేడు బలహీనపడిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావతి విభాగం వెల్లడించింది. ఇది దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాలకు చేరువలో ఉందని వివరించింది.
అయితే, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని... దీని ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో ఇవాళ కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ అమరావతి పేర్కొంది.
అదే సమయంలో రాయలసీమ, ఉత్తర కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
కాగా, అల్పపీడనం బలహీనపడినప్పటికీ నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో గణనీయ స్థాయిలో వర్షపాతం నమోదైంది.