Revanth Reddy: సీఎంతో భేటీ... అల్లు అరవింద్, రాఘవేంద్రరావు ఏమన్నారంటే..!
- ముగిసిన సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీ
- పరిశ్రమలో తీసుకోవాల్సిన పలు చర్యలపై సినీ పెద్దలకు సీఎం దిశా నిర్దేశం
- తెలుగు నిర్మాతలకు ఈరోజు శుభదినంగా పేర్కొన్న అల్లు అరవింద్
- ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా దిల్ రాజును నియమించడాన్ని స్వాగతిస్తున్నామన్న రాఘవేంద్రరావు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. ఈ సమావేశంలో సినీ పరిశ్రమకు చెందిన దాదాపు 46 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో తీసుకోవాల్సిన పలు చర్యలపై ముఖ్యమంత్రి సినీ పెద్దలకు దిశా నిర్దేశం చేశారు.
ఇక ఈ భేటీలో ప్రముఖ నిర్మాత, హీరో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ మాట్లాడారు. ముందుగా ప్రభుత్వాన్ని కలిసే అవకాశం ఇచ్చినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలుగు నిర్మాతలకు ఈరోజు శుభదినంగా పేర్కొన్నారు. హైదరాబాద్‌ను వరల్డ్ షూటింగ్ డెస్టినేషన్‌గా మారడానికి ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు.
భాగ్యనగరం షూటింగ్‌లకు చాలా అనువైన ప్రదేశంగా ముంబయి వాళ్లు చెబుతుంటారని, దానికి ఒక కారణం వారి దగ్గర కంటే మన దగ్గర ట్రాఫిక్ సమస్య తక్కువగా ఉండడమే అని తెలిపారు. అలాగే సంధ్య థియేటర్ లాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూస్తామని అల్లు అరవింద్ ప్రభుత్వానికి హామీ ఇచ్చారు.
అలాగే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ... అందరూ ముఖ్యమంత్రుల లాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా తమను బాగానే చూసుకుంటున్నారని అన్నారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా దిల్ రాజును నియమించడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయని తెలిపారు.
గతంలో చంద్రబాబు హైదరాబాద్‌లో చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా రాఘవేంద్రరావు గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌ను హైదరాబాద్‌లో నిర్వహిస్తే బాగుంటుందని ఆయన చెప్పారు.