pm modi: జనవరి 8న ఏపీకి ప్రధాని మోదీ
- మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు రానున్న ప్రధాని మోదీ
- విశాఖ రైల్వే జోన్ సహా రూ.85వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న మోదీ
- ప్రధాని పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి లోకేశ్, ఎంపీ సీఎం రమేశ్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏపీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. జనవరి 8న ఆయన ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. విశాఖ రైల్వే జోన్‌తో పాటు దాదాపు రూ.85 వేల కోట్ల విలువైన అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎన్టీపీసీ, ఏపీ జెన్కో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ తదితర నిర్మాణాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 25 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
వాస్తవానికి నవంబర్‌లోనే ప్రధాని మోదీ వీటికి శంకుస్థాపన చేయాల్సి ఉంది. అందుకు షెడ్యూల్ కూడా ఖరారు చేశారు. అయితే నాడు తుపాను రావడంతో మోదీ పర్యటన వాయిదా పడింది. ఆ తర్వాత నవంబర్ 29న ప్రధాని పర్యటన ఖరారు చేశారు. అయితే తుపాను కారణంగా రెండోసారి కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఇప్పుడు మళ్లీ ప్రధాని ఉత్తరాంధ్ర పర్యటన ఖరారైంది. జనవరి 8న ఆయన రాష్ట్రానికి రానున్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారిక కార్యక్రమాల్లో మోదీ పాల్గొనడం ఇదే తొలిసారి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ సన్నాహాలు చేస్తోంది. ఏర్పాట్లను మంత్రి నారా లోకేశ్‌తో పాటు ఎంపీ సీఎం రమేశ్ పర్యవేక్షిస్తున్నారు. 8న జరగబోయే కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు.