Kunche Raghu: ఆస్తుల విషయంలో నాకు ముందుచూపు తక్కువే : కుంచె రఘు
- యాంకర్ గా ఆకట్టుకున్న కుంచె రఘు
- సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు
- ప్రస్తుతం నటుడిగా బిజీ
- ఆస్తులపై దృష్టి ఉండేది కాదని వెల్లడి
కుంచె రఘు .. యాంకర్ గా .. సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్య కాలంలో నటుడిగా ఆయన ఎక్కువ సినిమాలలో కనిపిస్తున్నాడు. ఓ మాదిరి బడ్జెట్ సినిమాలలో ఆయన నెగెటివ్ రోల్స్ తో మెప్పిస్తున్నాడు. తాజాగా ఆయన ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు.
" హైదరాబాద్ కలర్స్ మారుతూ ఉండగా దగ్గర నుంచి చూసినవాడిని నేను. ఆస్తులు ఏమైనా కూడబెట్టానా అంటే, నేను అంత జాగ్రత్తపరుడిని కాదనే చెబుతాను. ఎలాంటి అప్పులూ లేకుండా .. నాకు నచ్చినట్టుగానే ఇప్పుడు నా లైఫ్ హ్యాపీగా సాగిపోతోంది. అంతకు మించి అంటే .. అంత ముందుచూపు నాకు లేదనే చెబుతాను. ఆస్తులు కొనుక్కోవడానికి చాలా అవకాశాలు వచ్చాయి. కానీ వాటిని కొనాలనే ఆలోచన అప్పుడు ఉండేది కాదు" అని అన్నాడు.
" ఇప్పుడు నా స్టూడియో ఉన్న ఫ్లాట్ నా సొంతమే. 6 ఫ్లాట్లు ఉన్న అపార్టుమెంటు అది. హైటెక్ సిటీకి దగ్గరలో ఉంది. అప్పట్లో నేను 5 లక్షలకు తీసుకున్నాను. ఆ పక్కనే ఉన్న రెండు ఫ్లాట్లు ఖాళీగానే ఉన్నాయి. '11 లక్షలిచ్చి మూడు ఫ్లాట్లు తీసుకోండి' అని ఓనర్ అన్నాడు. అప్పట్లో అక్కడ రోడ్డు కూడా సరిగ్గా ఉండేది కాదు .. ఆటోలు కూడా వచ్చేవి కాదు. ఇక్కడ మనకి ఎందుకులే అనుకున్నాను. అప్పుడు తీసుకుని ఉంటే బాగుండేది" అని చెప్పాడు.