Pawan Kalyan: వాజ్‌పేయి జీవితం ప్రతి ఒక్కరికి మార్గదర్శకం.. గొప్ప దేశభక్తులలో అటల్‌జీ ఒకరు: డిప్యూటీ సీఎం ప‌వ‌న్

AP Deputy CM Pawan Kalyan Praises Atal Bihari Vajpayee

  • మాజీ ప్ర‌ధాని వాజపేయి శత జయంతి సందర్భంగా ప‌వ‌న్ నివాళి
  • ఈ సంద‌ర్భంగా అట‌ల్‌జీని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తిన జ‌న‌సేనాని
  • మాతృభూమి స్వేచ్ఛ కోసం నిరంతరం కృషి చేసిన మహానీయుడని ప్ర‌శంస‌
  • ఆయ‌న‌ పదాలు, పద్యాలు లక్షలాది మంది హృదయాలను తాకాయన్న ప‌వ‌న్‌ 
  • వాజ్‌పేయి దేశాన్ని ఐక్యత వైపు పరుగులు పెట్టించారని కితాబు

మాజీ ప్ర‌ధాని అటల్ బిహారీ వాజపేయి శత జయంతి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత పవన్‌కల్యాణ్‌ మంగళవారం ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదికగా ఆయ‌న‌కు నివాళి అర్పించారు. ఈ సంద‌ర్భంగా గొప్ప దేశ భక్తులలో ఆయ‌న‌ ఒకరని కొనియాడారు. మాతృభూమి స్వేచ్ఛ కోసం నిరంతరం కృషి చేసిన మహానీయుడని పేర్కొన్నారు.

ఆయ‌న‌ అసాధారణ మాటతీరు దేశ భ‌క్తుల‌ గుండెల్లో మంటలు ర‌గిలించ‌గ‌ల‌ద‌ని, అలాగే ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించ‌ల‌ద‌ని తెలిపారు. అట‌ల్‌జీ అద్భుత‌మైన వాక్చాతుర్యం గల గొప్ప రాజనీతిజ్ఞుడని ప‌వ‌న్ ప్ర‌శంసించారు. ఆయ‌న‌ పదాలు, పద్యాలు లక్షలాది మంది హృదయాలను తాకాయన్నారు. చాలా మందికి స్ఫూర్తినిచ్చాయని పేర్కొన్నారు. 

పార్లమెంట్‌లో ఆయన విలక్షణమైన మాటలు త‌న‌ను వ్యక్తిగతంగా రాజకీయ పార్టీని నడిపించడంలో మార్గనిర్దేశం చేశాయ‌న్నారు. వాజ్‌పేయి దేశాన్ని ఐక్యత వైపు పరుగులు పెట్టించారని వెల్లడించారు. అటల్‌జీ భారతదేశపు ఆధునిక వాస్తుశిల్పిలలో ఒకర‌ని, ఆయన నాయకత్వం భారతదేశ విధిని మార్చింద‌ని ప‌వ‌న్ ప్ర‌శంసించారు. 

ఆయ‌న నాయకత్వం భారతదేశ పరిస్థితులను మార్చివేశాయని స్వర్ణ చతుర్భుజం నుంచి, పోఖ్రాన్ అణు పరీక్షల వరకు, సర్వశిక్షా అభియాన్ నుంచి అందరికీ విద్యను అందించే అన్నపూర్ణ అన్న యోజన వరకు అహర్నిశలు ప్రజల కోసం శ్రమించిన గొప్ప వ్య‌క్తి అని తెలిపారు. ఇక హిందీలో చారిత్రాత్మక ఐక్యరాజ్యసమితి ప్రసంగం అనేది ప్రపంచ వేదికపై ఆత్మవిశ్వాసం, స్వావలంబన భారత్ గురించి ఆయ‌న‌ దృష్టిని ప్రతిబింబిస్తుంద‌న్నారు. 

అటల్‌జీ జీవితం నాయకులకు, పౌరులకు మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. వాజ్‌పేయి అమర పదాలలో “ఛోటే మన్ సే కోయ్ బడా నహీం హోతా.. టూటే మన్ సే కోయ్ ఖడా నహీం హోతా” (“సంకుచిత మనస్సుతో ఎవరూ గొప్పవారు కాలేరు.. విరిగిన మనస్సుతో ఎవరూ పెద్దగా నిలబడలేరు”) అనే పదం చిరకాలంగా నిలిచిపోతుందని ప‌వ‌న్ ట్వీట్ చేశారు.

Pawan Kalyan
AP Deputy CM
Atal Bihari Vajpayee
Andhra Pradesh
Janasena

More Telugu News