Rahul Gandhi: ముందే నిర్ణయించారు.. ఎన్‌హెచ్చార్సీ చీఫ్ నియామకంపై కాంగ్రెస్ ఆరోపణలు

Rahul Gandhi and Mallikarjun Kharge dissented on NHRC chiefs appointment

  • ఎంపిక ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందన్న రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే
  • పరస్పర సంప్రదింపులు, ఏకాభిప్రాయాన్ని విస్మరించారని మండిపాటు
  • అసమ్మతి నోట్‌ను విడుదల చేసిన కాంగ్రెస్ అగ్రనేతలు

జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్చార్సీ) చైర్మన్, సభ్యుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఎంపిక ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని, ముందే నిర్ణయించి అందుకు అనుగుణంగా కసరత్తు చేపట్టారంటూ లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపణలు గుప్పించారు. పరస్పర సంప్రదింపులు జరపలేదని, ఏకాభిప్రాయాన్ని తీసుకోలేదని విమర్శించారు.

ఎన్‌హెచ్చార్సీ చైర్మన్ పదవికి జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్, జస్టిస్ కుట్టియిల్ మాథ్యూ జోసెఫ్ పేర్లను రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ప్రతిపాదించారు. అయితే, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి.రామసుబ్రమణియన్‌‌ ఎన్‌హెచ్చార్సీ చీఫ్‌గా ఎంపికయ్యారు. 

సభ్యుల స్థానానికి జస్టిస్ ఎస్ మురళీధర్, జస్టిస్ అకిల్ అబ్దుల్ హమీద్ ఖురేషీల పేర్లను సిఫార్సు చేశారు. వీరిద్దరికీ మానవ హక్కులను సమర్థించడంలో చక్కటి ట్రాక్ రికార్డులు ఉన్నాయని సూచించారు. అయినప్పటికీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని, వీరి చేరిక ఎన్‌హెచ్చార్సీలో వైవిధ్యానికి దోహదం చేస్తుందని అసమ్మతి నోట్‌లో పేర్కొన్నారు. 

ఎన్‌హెచ్చార్సీ చైర్మన్ నియామకంలో ప్రాంతం, మతం, కులాల సమతుల్యతను పాటించలేదని అన్నారు. ఈ మేరకు అసమ్మతి నోట్‌‌లో రాహుల్ గాంధీ, ఖర్గే పేర్కొన్నారు. ఇటువంటి ఎంపిక ప్రక్రియ ‘ప్రభుత్వ తోసిపుచ్చే విధానాన్ని’ స్పష్టం చేస్తోందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News