crda: రాజధానిపై వైసీపీ దుష్ప్రచారం.. ప్రజలపై పైసా భారం కూడా వేయం: మంత్రి నారాయణ

ap crda approves additional capital works in amaravati costing rs2723 crore

  • సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 44వ సమావేశం 
  • రాజధానిలో మరో 2,723.02 కోట్ల విలువైన పనులకు సీఆర్డీఏ ఆమోదం తెలిపిందన్న నారాయణ
  • మిగిలిన భూములను విక్రయించి రాజధాని నిర్మిస్తామన్న మంత్రి 

అమరావతి రాజధాని నిర్మాణంపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మండిపడ్డారు. అమరావతి స్వయం సమృద్ధి ప్రాజెక్టు అని పునరుద్ఘాటించిన ఆయన .. ప్రజలపై ఒక్క పైసా భారం కూడా వేయకుండా రాజధాని నిర్మిస్తామని స్పష్టం చేశారు. 

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సీఆర్డీఏ 44వ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. భూసమీకరణలో భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించగా మిగిలిన భూములను విక్రయించి అమరావతిని నిర్మిస్తామని తెలిపారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ వంటి సంస్థల నుంచి తీసుకునే రుణాలను అమరావతిలో భూములు విక్రయించడంతో పాటు భవిష్యత్తులో అక్కడి నుంచి వచ్చే ఆదాయంతో తీరుస్తామని తెలిపారు. 

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రాజధాని పనులు పునః ప్రారంభించడంతో వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే అమరావతిపై విమర్శలు చేస్తున్నారన్నారు. అమరావతిని అభివృద్ధి చేస్తూనే రాష్ట్రంలోని 26 జిల్లాల సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రణాళికలు రూపొందించారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను రాష్ట్ర నలుమూలలా ఏర్పాటు చేస్తామని తెలిపారు. అన్ని జిల్లాల సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి అదే నిదర్శనమని పేర్కొన్నారు. 

తాజాగా రాజధానిలో మరో 2,723.02 కోట్ల విలువైన పనులకు సీఆర్డీఏ ఆమోదం తెలిపిందని అన్నారు. జనవరి 15 లోగా రాజధానిలో మొత్తం పనులకు టెండర్లు పిలుస్తామని చెప్పారు. మూడేళ్లలో రాజధానిలో నిర్మాణాలు పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News