Ravichandran Ashwin: అలాంటి వాటిని నేను నమ్మను.. రిటైర్మెంట్‌పై అశ్విన్ కీలక వ్యాఖ్యలు!
- ఇటీవల అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు అల్విదా చెప్పిన అశ్విన్
- సెలబ్రేషన్స్, అటెన్షన్‌పై తనకు నమ్మకం లేదన్న దిగ్గజ స్పిన్నర్
- కొన్నింటిని నిర్మొహమాటంగా వదిలేయాలనుకుంటానని వ్యాఖ్య
- ఎల్లప్పుడూ తనకంటే ఆటే ముందు కనిపిస్తుందని నమ్మే వ్యక్తినన్న అశ్విన్
- రిటైర్మెంట్ నిర్ణయం హఠాత్తుగా జరిగింది కాదని వెల్లడి
భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్టు ముగిసిన తర్వాత అశ్విన్ మీడియా సమావేశంలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఇలా అంతర్జాతీయ క్రికెట్‌కు హఠాత్తుగా వీడ్కోలు పలుకుతూ షాకింగ్ నిర్ణయం తీసుకోవడంతో అశ్విన్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు.
అయితే, తాజాగా అనూహ్య రీతిలో రిటైర్మెంట్ పై ఎట్టకేలకు అశ్విన్ నోరు తెరిచాడు. స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడిన స్పిన్నర్... తనకు సెలబ్రేషన్స్, అటెన్షన్‌పై పెద్దగా నమ్మకం లేదన్నాడు. కొన్నింటిని నిర్మొహమాటంగా వదిలేయాలనుకుంటానని తెలిపాడు. ఎల్లప్పుడూ తనకంటే కూడా ఆటే ముందు కనిపిస్తుందని నమ్మే వ్యక్తినని చెప్పుకొచ్చాడు.
"నా కోసం ఇతరులు సెలబ్రేషన్స్ చేసుకోవడం గురించి నేను ఎప్పడూ ఆలోచించలేదు. ఇంకా చెప్పాలంటే వాటిని పెద్దగా నేను నమ్మను. ఏదైనా విషయంలో ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మనలో ఎప్పుడూ ఒక ప్రశ్న ఉంటుంది. నేను సరైన నిర్ణయం తీసుకుంటున్నానా? అని. కానీ నా విషయంలో మాత్రం ఇది భిన్నంగా ఉంటుంది. నేను ఎప్పుడూ విషయాలను పట్టుకుని వేలాడే రకం కాదు. కొన్నింటిని నిర్మొహమాటంగా వదిలేయాలనుకుంటా.
అలాగే నేను ఎప్పుడూ అభద్రతా భావానికి గురికాలేదు. ఎందుకంటే నా వద్ద ఈ రోజు ఉంది.. రేపు నాది అవుతుందని నేను నమ్మను. ఈ ఆలోచనే నన్ను ఇన్నాళ్లు నడిపించింది. నా విషయంలో ఆటే ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉంటుంది. క్రికెట్ నుంచి నన్ను ఎవరూ విడదీయలేరు. ఇక రిటైర్మెంట్ నిర్ణయం హఠాత్తుగా జరిగింది కాదు. చాలా ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చాను" అని అశ్విన్ స్కై స్పోర్ట్స్‌తో అన్నాడు.