Free Bus Scheme: ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలంటే.. మరో 2 వేల బస్సులు కావాలట!

Free Bus Scheme in AP

  • ఫ్రీబస్‌ స్కీమ్‌లో అధికారుల ప్రాథమిక నివేదిక సమర్పణ 
  • వేలల్లో ఉద్యోగులు అవసరమవుతారని వెల్లడి  
  • నెలకు రూ. 200 కోట్ల ఆదాయం కోల్పోనున్న ఏపీఎస్‌ ఆర్టీసీ

ఏపీలో తెలుగుదేశం పార్టీ ఆధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ స్కీమ్‌ అమలుపై అధికారులు తర్జనభర్జనలు పడి స్కీమ్‌ అమలుకు సంబంధించిన ప్రాథమిక నివేదికను అందజేశారు. మరోపక్క, దీనిపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది.  ఈ సంఘం ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఫ్రీబస్‌ స్కీమ్‌ వివరాలను సేకరించి పరిశీలించడంతో పాటు అధికారులు ఇచ్చిన ప్రాథమిక నివేదికను కూడా పరిశీలిస్తుంది. ఇదిలా ఉంటే, ఏపీలో ప్రతిరోజూ సుమారు 44 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీలో ప్రయాణిస్తున్నారు.  ప్రతిరోజూ 27 లక్షల మంది టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. సూపర్‌ లగ్జరీ, ఏసీ బస్సుల్లో రోజూ 24 లక్షల మంది ప్రయాణిస్తుండగా రాబోయే రోజుల్లో ఈ సర్వీసుల్లోనే 10 లక్షల వరకు పెరిగే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు.

ఏపీ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారిలో 60 శాతం మంది పురుషులు, 40 శాతం మంది మహిళలు ఉన్నారు. ప్రస్తుతం మొత్తం ఆక్యుపెన్సీ 69 శాతంగా ఉంది. ఎప్పుడైతే ఫ్రీబస్‌ స్కీమ్‌ అమలు చేస్తారో అప్పటి నుంచి ఈ ఆక్యుపెన్సీ 95 శాతానికి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఆక్యుపెన్సీకి అనుగుణంగానే బస్సులు, సిబ్బంది, మెకానిక్‌లు ఉన్నారు. అయితే, ఫ్రీబస్‌ స్కీమ్‌ అమలు చేస్తే...దానికి తగ్గట్టుగా బస్సుల సంఖ్యను పెంచాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.  సుమారు మరో 2 వేలకు పైగా బస్సులు అవసరం అవుతాయని, అదనంగా డ్రైవర్లు, కండెక్టర్లు, మెకానిక్‌లు కలిపి మరో 11,500 మంది వరకు అవసరం అవుతారని అంచనా.  

ప్రస్తుతం ఏపీ ఆర్టీసీ ద్వారా రోజుకు 16 నుంచి 17 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోంది. ఇందులో మహిళా ప్రయాణికుల నుంచి సుమారు 6 నుంచి 7 కోట్ల వరకు ఆదాయం ఉంటోంది.  ఒకవేళ ఫ్రీబస్‌ స్కీమ్‌ అమలైతే రోజుకు ఆమేరకు మహిళా ప్రయాణికుల నుంచే వచ్చే ఆదాయాన్ని ఆర్టీసీ కోల్పోనుందని అధికారులు చెబుతున్నారు. అంటే నెలకు సుమారు 200 కోట్ల వరకు ఆదాయం తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు.  వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఉచిత బస్‌ సౌకర్యంపై మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇవ్వనుంది.

Free Bus Scheme
Andhra Pradesh
APSRTC
Free Bus Scheme for women
  • Loading...

More Telugu News