Sandhya Theater Incident: ఆసుపత్రిలో శ్రీతేజ్ బిల్లులు ఎవరు కడుతున్నారు?... తండ్రి చెప్పిన సమాధానం ఇదే!

Sritej father talks to media

  • డిసెంబరు 4న సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన
  • రేవతి అనే మహిళ మృతి... ఆమె కుమారుడు శ్రీతేజ్ కు తీవ్రగాయాలు
  • ఇప్పటికీ ఆసుపత్రి బెడ్ పైనే ఉన్న బాలుడు
  • శ్రీతేజ్ తండ్రిని పలకరించిన మీడియా

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద డిసెంబరు 4వ తేదీన జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ అనే బాలుడు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో శ్రీతేజ్ తల్లి రేవతి మృతి చెందడం అందరినీ కలచివేసింది. 9 ఏళ్ల శ్రీతేజ్ ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో, శ్రీతేజ్ తండ్రిని మీడియా పలకరించింది.

శ్రీతేజ్ బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అయ్యాయని ఆయన వెల్లడించారు. ఎప్పట్లోగా కోలుకుంటాడనేది డాక్టర్లు కూడా కచ్చితంగా చెప్పలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడికి స్పృహ వస్తేనే కోలుకునే అవకాశాలు ఉంటాయని, తాము శక్తిమేర వైద్యం చేస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారని ఆయన వివరించారు. 

ఇక, ఆసుపత్రి నుంచి తమను బయటికి రానివ్వకుండా, ఎవరితో మాట్లాడకుండా అల్లు అర్జున్ టీమ్ మొత్తం మోహరించి ఉందంటూ వస్తున్న కథనాలు అవాస్తవం అని శ్రీతేజ్ తండ్రి కొట్టిపారేశారు. అల్లు అర్జున్ టీమ్ తమకు అండగా నిలుస్తోందని చెప్పారు. తన బిడ్డను ఆసుపత్రిలో చేర్చిన రెండో రోజు నుంచే అల్లు అర్జున్ బృందం మద్దతుగా నిలిచిందని తెలిపారు. 

"అల్లు అర్జున్ మేనేజర్లు ప్రతి రోజూ ఆసుపత్రికి వచ్చి మా అబ్బాయి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు. ఇటీవల సర్జరీ జరిగినప్పుడు కూడా వాళ్లు వచ్చి డాక్టర్లతో మాట్లాడారు. అల్లు అర్జున్ తరఫు నుంచి మాకు రూ.10 లక్షలు అందాయి. మిగతా రూ.15 లక్షలు త్వరలోనే సర్దుబాటు చేస్తామని చెప్పారు. మా అబ్బాయిని ఆసుపత్రిలో చేర్చిన మొదట్లో రూ.50 వేలు బిల్లు కట్టాను. అప్పట్నించి మిగతా బిల్లులన్నీ అల్లు అర్జున్ టీమ్ కడుతోంది. 

ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా మాకు అండగా నిలిచింది. అందుకు సీఎం రేవంత్ రెడ్డి సార్ కు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సార్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కోమటిరెడ్డి సార్ వాళ్ల ఫౌండేషన్ నుంచి రూ.25 లక్షల చెక్ ఇచ్చారు. బాలుడి చికిత్సకు అవసరమైతే అమెరికా నుంచి అత్యాధునిక వైద్య పరికరాలు తెప్పించాలని, అందుకు అయ్యే ఖర్చు భరిస్తానని కోమటిరెడ్డి సార్ చెప్పారు. 

అల్లు అర్జున్ సార్ పై కేసును వెనక్కి తీసుకుంటానని నేను చేసిన ప్రకటన వెనుక ఎవరి ఒత్తిడి లేదు. నా బిడ్డ ఆసుపత్రిలో చేరిన రెండో రోజు నుంచే అల్లు అర్జున్ సార్ వాళ్ల టీమ్ మాకు సపోర్ట్ గా నిలిచింది. మా వల్ల ఆయన జైలుకు వెళతాడన్న ఉద్దేశంతోనే కేసును వాపసు తీసుకుంటానని చెప్పాను" అని వివరించారు. 

Sandhya Theater Incident
Sritej
Father
KIMS
Allu Arjun
Hyderabad
Congress
Telangana
  • Loading...

More Telugu News