Platelets: రక్తంలో ప్లేట్‌ లెట్లను పెంచే సహజమైన ఫుడ్‌ ఇదే!

foods that help increase platelet count naturally

  • డెంగ్యూ వంటి విష జ్వరాలు, పోషకాహార లేమితో రక్తంలో తగ్గిపోయే ప్లేట్‌ లెట్లు
  • గాయాలు మానడానికి, రక్తం గడ్డకట్టడానికి ప్లేట్‌ లెట్లు తప్పనిసరి
  • వాటి సంఖ్యను సహజంగానే పెంచేందుకు కొన్ని రకాల ఆహారం తోడ్పడుతుందని చెబుతున్న నిపుణులు

ఇటీవలి కాలంలో డెంగ్యూ వంటి విష జ్వరాలు పంజా విసురుతున్నాయి. దానితో రక్తంలో ప్లేట్‌ లెట్ల సంఖ్య తగ్గిపోయి ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. పోషకాహార లేమి కూడా ఈ సమస్యను మరింతగా పెంచుతోంది. శరీరంలో గాయాలు మానడానికి, రక్తం గడ్డకట్టడానికి ప్లేట్‌ లెట్లు తప్పనిసరి. తగిన సంఖ్యలో ప్లేట్‌ లెట్లు లేకుంటే... ప్రాణాలకే ప్రమాదం కూడా. అలాంటి ప్లేట్‌ లెట్ల సంఖ్యను సహజంగానే పెంచేందుకు కొన్ని రకాల ఆహారం తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ ఆహారంలో వాటిని చేర్చుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందని వివరిస్తున్నారు.

బొప్పాయి పళ్లు, ఆకులు...
గతంలో డెంగ్యూ వ్యాధి తీవ్ర స్థాయిలో పంజా విసిరినప్పుడు... బొప్పాయి ఆకులు, బొప్పాయి పళ్లతో ఉన్న ప్రయోజనంపై వార్తలు వెలువడ్డాయి. చాలా మందిలో ఇవి మంచి ఫలితాన్ని కూడా ఇచ్చాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. బొప్పాయిలో అధికంగా ఉండే విటమిన్‌ సి, కొన్ని రకాల ఎంజైమ్‌ లు రక్తంలో ప్లేట్‌ లెట్ల సంఖ్య పెరగడానికి తోడ్పడతాయని వివరిస్తున్నారు.

దానిమ్మ పళ్లు... 
ఒక రకంగా చెప్పాలంటే దానిమ్మ పండు వరప్రదాయిని అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో అధిక స్థాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు శరీరంలో వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ)ని బలోపేతం చేస్తాయని వివరిస్తున్నారు. ముఖ్యంగా రక్తంలో ప్లేట్‌ లెట్ల సంఖ్య పెరగడానికి తోడ్పడతాయని పేర్కొంటున్నారు.

ఆకుకూరలు, ఆకుపచ్చని కూరగాయలు... 
పాలకూర, కేల్‌, బ్రాకొలి వంటి ఆకుకూరలు, కూరగాయల్లో విటమిన్‌ కె ఎక్కువగా ఉంటుందని... మన శరీరంలో రక్తం గడ్డకట్టేందుకు ఇది కీలకమైనదని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఏదో ఒక రకంగా తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందని వివరిస్తున్నారు.

గోధుమ గడ్డి...
గోధుమ గడ్డి జ్యూస్‌ ను తరచూ తీసుకుంటుంటే... శరీరంలో హీమోగ్లోబిన్‌ వృద్ధి చెందుతుందని, ప్లేట్‌ లెట్ల సంఖ్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

నువ్వుల నూనె... 
మన శరీరానికి అత్యంత అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు, పోషకాలు నువ్వులలో ఉంటాయని... అవి రక్తంలో ప్లేట్‌ లెట్ల సంఖ్య పెరిగేందుకు దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. నువ్వుల నూనెతో వంట చేసుకున్నా... రోజూ ఒక స్పూన్‌ నేరుగా తీసుకున్నా మంచి ప్రయోజనం ఉంటుందని వివరిస్తున్నారు.

గుమ్మడి పండు... 
గుమ్మడి పండ్లలో అధికంగా ఉండే విటమిన్‌ ఏ, కొన్ని ఎంజైములు మన శరీరంలో ప్లేట్‌ లెట్ల ఉత్పత్తికి తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో ఇమ్యూనిటీని పెంచుతాయని... డెంగ్యూ వంటి వ్యాధులను ఎదుర్కోవడంలో తోడ్పడతాయని వివరిస్తున్నారు.

బీట్‌ రూట్‌...
దీనిలో ఐరన్‌, ఫోలేట్‌ అధికంగా ఉంటాయని... ఇవి ఎర్ర రక్తకణాలు, ప్లేట్‌ లెట్ల ఉత్పత్తికి తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు. జ్యూస్‌ గా గానీ, సలాడ్ల రూపంలో గానీ బీట్‌ రూట్‌ తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

క్యారెట్లు... 
వీటిలో అధికంగా ఉండే విటమిన్‌ ఏ, బీటా కెరోటిన్‌ వంటివి ప్లేట్‌ లెట్ల ఉత్పత్తికి, ఇమ్యూనిటీ పెరుగుదలకు తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని కూరల్లో భాగంగా, పచ్చిగా, జ్యూస్‌ గా... ఇలా ఎలా తీసుకున్నా ప్రయోజనం ఉంటుందని వివరిస్తున్నారు.

సిట్రస్‌ పళ్లు... 
నారింజ, నిమ్మ వంటి సిట్రస్‌ జాతి పళ్లలో విటమిన్‌ సి ఎక్కువని... ఇది ఇమ్యూనిటీకి, ప్లేట్‌ లెట్ల సంఖ్య పెరగడానికి దోహదం చేస్తుందని నిపుణులు వివరిస్తున్నారు.

  • Loading...

More Telugu News